
- తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ అంగీకారం
- ఆక్రమణకు గురైన భవన్ స్థలాన్ని మరోచోట కేటాయించాలని కండీషన్
- తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరుతూ సీఎస్‌కు కేంద్ర హోం శాఖ లేఖ
న్యూఢిల్లీ, వెలుగు : దాదాపు పదేండ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ/ తెలంగాణ భవన్ ఉమ్మడి ఆస్తుల విభజనపై కీలక ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం సూచించిన పలు ప్రతిపాదనల్లో ‘ఆప్షన్ జీ’కి ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ ఆప్షన్ ప్రకారం ముందుకెళ్లాలంటే ఆక్రమణ రూపంలో ఏపీ కోల్పోయే 0.512 ఎకరానికి మరోచోట స్థలం కేటాయించాలని కోరింది. ఆస్తుల విభజన హామీలకు కేంద్ర హోంశాఖ నోడల్ ఆఫీసుగా వ్యవహరిస్తోంది. దీంతో ఏపీ నిబంధలను తెలుపుతూ బుధవారం కేంద్ర హోంశాఖ డిప్యూటీ సెక్రటరీ లలిత్ కపూర్ తెలంగాణ సీఎస్‌కు లేఖ రాశారు.
విభజన హామీలకు నోడల్ ఆఫీస్ గా ఉన్న కేంద్ర హోం శాఖ బుధవారం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏపీకి రావాల్సిన స్థలంలో ఇంటర్నల్ రోడ్ ఉందని, ఇందులో 0.512 ఎకరాల స్థలంలో ఆక్రణమలు ఉన్నాయని ఆ రాష్ట్రం పేర్కొంది. ఈ స్థలం రేటు దాదాపు రూ.250 కోట్లుగా ఉంటుందని తెలిపింది. ఈ ఆక్రమణలు తొలగించకపోతే ఆ స్థలాన్ని ఏపీ సర్కార్ ఉపయోగించుకోలేదని, వాటిని తొలగించడం వీలుకాకపోతే... ఇందుకు నష్ట పరిహారంగా అందుకు సమాన భూమిని తెలంగాణకు కేటాయించే శబరీ బ్లాక్ లేదా పటౌడి హౌజ్ లో కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కోరుతున్నట్లు లేఖలో పేర్కొంది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని చెప్పాలని కేంద్ర హోంశాఖ కోరింది.