
వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్స్. రజిత్ రావు నిర్మించారు. ఈ నెల 9న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సన్నీ మాట్లాడుతూ ‘‘జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, టీవీ యాంకర్‌గా, నటుడిగా ఎదిగాను. ‘బిగ్ బాస్ షో’ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం మాస్ కమర్షియల్ కథలే. నాకు కామెడీ, హారర్ కామెడీ, థ్రిల్లర్ జానర్‌లో పక్కింటి అబ్బాయి తరహా పాత్రలు చేయాలనుంది.
ఆ టైమ్‌లో రత్నబాబు గారు చెప్పిన కథ నచ్చి ఓకే చెప్పా. నేనూ, సప్తగిరి.. చిచ్చా, మచ్చా అనే పాత్రల్లో నటించాం. సినిమా అంతా మా ఇద్దరి పాత్రల చుట్టూనే తిరుగుతుంది. మేమిద్దరం అనుకోకుండా చిక్కుల్లో పడతాం. వాటి నుండి ఎలా బయటపడ్డాం అనేది ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది. ప్రారంభం నుండి చివరి వరకూ ఓ ఫన్ రైడ్‌లా ఉంటుంది. చాలామంది కమెడియన్స్ ఇందులో నటించారు. ప్రతి పాత్ర నవ్విస్తుంది. కేవలం హీరోగా కొనసాగాలని కాకుండా ఒక నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది.
అందుకే హీరోగా నటిస్తూనే, ఇతర హీరోల సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నా. ఇక ‘బిగ్ బాస్’ షో అనే కాదు.. ఎలాంటి ఫేమ్ అయినా కొద్ది నెలలకు మించి ఉండదు. ఆ తర్వాత మనం ఏం చేశామన్నదే ముఖ్యం. అందుకే నేను సినిమాలపై ఫోకస్ పెట్టి, ‘ఏటిఎం’ అనే వెబ్ సిరీస్‌లో నటించా. అందులో నా నటన చూసి హరీష్ శంకర్ గారు మెచ్చుకోవడం నాలో కాన్ఫిడెన్స్‌ను మరింత పెంచింది. ప్రస్తుతం మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నా’’ అని చెప్పాడు.