విభజన హామీలు..నెరవేరుస్తున్నామనడం హాస్యాస్పదం : ఎంపీ అనిల్ కుమార్ యాదవ్

విభజన హామీలు..నెరవేరుస్తున్నామనడం హాస్యాస్పదం : ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
  • నిర్మల వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు గడిచిన పదేండ్లలో భారీగా నిధులు కేటాయించామని, విభజన హామీలను నెరవేరుస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తెలంగాణపై అన్ని రకాలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, పైకి మాత్రం సవతి తల్లి ప్రేమ చూపించడం ఎందుకని మండిపడ్డారు.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు, విభజన హామీలపై కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలను అనిల్ గురువారం ఖండించారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీల్లో ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయలేదన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, రాష్ట్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు పెండింగ్ లోనే ఉన్నాయని గుర్తు చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఉండేదని.. కానీ, కేసీఆర్ కుటుంబం పుణ్యాన రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లిందన్నారు. దీనికితోడు గత పదేండ్లలో తెలంగాణకు బీఆర్ఎస్ తోపాటు కేంద్రం కూడా తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికీ, న్యాయంగా దక్కాల్సినవి మాత్రం రావడం లేదన్నారు.