కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను ఎందుకు జైలుకు పంపట్లే : బీజేపీ ఎంపీ ధర్వపురి అర్వింద్

కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను ఎందుకు జైలుకు పంపట్లే : బీజేపీ ఎంపీ ధర్వపురి అర్వింద్
  •     సీఎం రేవంత్​కు ఎంపీ అర్వింద్  సవాల్
  •     కాంగ్రెస్ పాలనపై 11 అంశాలతో ఢిల్లీలో రెండేళ్ల చార్జిషీట్ రిలీజ్

న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్, కేటీఆర్  అక్రమాల చిట్టా ఉందని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. వారిని జైలుకు ఎందుకు పంపడం లేదని బీజేపీ ఎంపీ ధర్వపురి అర్వింద్  ప్రశ్నించారు. కేసీఆర్  ఆస్పత్రి చుట్టూ తిరిగే పనిలో ఉన్నారని, కనీసం కేటీఆర్​నైనా అరెస్టు చేయాలి కదా? అని నిలదీశారు. ఆదివారంఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ‘రెండేళ్ల ప్రజా వంచన పాలనలో కాంగ్రెస్  వైఫల్యాల చిట్టా’ పేరుతో 11 అంశాలతో కూడిన చార్జిషీట్ ను అర్వింద్  విడుదల చేసి మాట్లాడారు.

 తెలంగాణలో రేవంత్  రెండేళ్ల పాలనలో 793 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. సగటున ఒక్కో రైతుపై సుమారు రూ.లక్ష అప్పు ఉందన్నారు. మరోవైపు రెండేండ్లలో సీఎం, మంత్రివర్గం, వారి బంధువులు అందిన కాడికి దోచుకున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్  దందా జరుగుతోందన్నారు. 

‘‘పేదల గుడిసెలు కూల్చడమే తప్ప ఒవైసీ అక్రమ కట్టడాల వైపు చూసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్  ఉద్యోగులు వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. చివరకు హిందూ దేవుళ్లను కూడా వదలడం లేదు” అని అర్వింద్  వ్యాఖ్యానించారు.