
వరంగల్ రూరల్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా రైతుల పరిస్థితి మారలేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. వరంగల్ రూరల్‌లో బీజేపీ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాష్ట్రంలో రైతుల పరిస్థితితోపాటు కొత్త వ్యవసాయ చట్టాల గురించి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాలీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అందరూ అన్నదాతలను పీల్చి పిప్పి చేస్తున్నారని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలతో కేసీఆర్‌కు ఉన్న సమస్య ఏంటో తమకు అర్థం కావడం లేదన్నారు. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణలో నిర్వహించిన బంద్‌ను రాష్ట్ర ప్రభుత్వమే పోలీసులతో చేయించిందన్నారు. అందులో రైతులు పాల్గొనలేదని, ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొంటున్న వారిలో అన్నదాతలు లేరన్నారు. కొత్త అగ్రి చట్టాలు రైతులకు సుదర్శన చక్రం లాంటివని, దళారుల వ్యవస్థను రూపుమాపేందుకే ఈ చట్టాలను తెచ్చామన్నారు.
‘కొత్త వ్యవసాయ చట్టాల గురించి చర్చిద్దామని ఢిల్లీలో రైతులను పిలిస్తే ఎవ్వరూ రావడం లేదు. మాట్లాడబోమని, చట్టాలను వెనక్కి తీసుకోవాలని అంటున్నారు. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. చర్చలకు మేం రెడీ. ఎంఎస్‌పీ విషయంలో హామీ కావాలంటే ప్రధాని మోడీ జీ లిఖితపూర్వకంగా రాసిస్తారు. కలెక్టర్‌ను దాటి కోర్టుకు వెళ్లాలని రైతులు కోరుకుంటే దానికి ఓకే చెబుతాం. కానీ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటే మాత్రం కుదరదు. తమాషాలు చేస్తే బాగోదు. మేం రోడ్డు మీదకు దిగితే పరిస్థితి వేరేలా ఉంటుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీలో చూసింది ట్రైలర్‌లే’ అని అర్వింద్ పేర్కొన్నారు.
‘రైతు చట్టాలను త్వరగా అమలు చేయాలని అవసరమైతే ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి తీసుకొస్తుంది. అన్నదాతలు ఇబ్బంది పడొద్దు. ఎంఎస్‌పీకి అదనంగా ఇచ్చుకోవచ్చునని కొత్త అగ్రి చట్టాల్లో ఉంది. రైతుల భూములు పోతాయని అంటున్నారు. అన్నదాతల భూములను లీజుకు తీసుకోవడానికి, మార్టిగేజ్ చేయడానికి, తాకట్టు పెట్టడానికీ వీల్లేదని కూడా చట్టాల్లో ఉంది. పంట మీదే అగ్రిమెంట్ ఉంది. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు రిలయన్స్, పార్క్ హయత్ లాంటి సంస్థలు వస్తున్నట్లే సాధారణ రైతుల పంటల వద్దకు అవే సంస్థలు వస్తాయి, కొంటాయి’ అని ధర్మపురి అర్వింద్ వివరించారు.