గ్రూప్​ వన్​ ఎగ్జామ్​ ఉర్దూలో ఎట్ల పెడతరు?

గ్రూప్​ వన్​ ఎగ్జామ్​ ఉర్దూలో ఎట్ల పెడతరు?

నిజామాబాద్, వెలుగు : గ్రూపు వన్​రాత పరీక్షలో ఉర్దూభాషకు చోటిచ్చి, ఇంటర్వ్యూ విధానం కూడా తొలగించి ముస్లింలకు సీఎం కేసీఆర్​ ఈద్​ ముబారక్​చెప్పారని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ ధర్మపురి అన్నారు.  ఉర్దూభాషలో రాసే పరీక్ష పేపర్లను ముస్లింలే దిద్దుతారని,  ఈ విధానం అమలైతే హిందువులు నష్టపోతారన్నారు. దీనిని ఎలా అడ్డుకోవాలో, కార్యచరణ ఏమిటనేది పార్టీ డిసైడ్ చేస్తుందన్నారు. బీజేపీ జిల్లా ఆఫీసులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  గ్రూపు వన్ పరీక్షను ఉర్దూలో కూడా నిర్వహిస్తామని కేసీఆర్​ చెప్పడాన్ని ఎంపీ తప్పుపట్టారు‌. ఇక ఓవైసీ రాష్ట్రాన్ని శాసిస్తాడని, కేసీఆర్​ ఆయన ఆదేశాలను పాటిస్తాడన్నారు. హిందీ, ఇంగ్లీషు తెలుగులో రాసే పరీక్ష పేపర్లను ఎవరైనా దిద్దవచ్చని, కానీ ఉర్దూలో రాసింది ముస్లింలే దిద్దుతారని..ఫలితంగా పక్షపాతధోరణికి ఆస్కారం ఉంటుందన్నారు. దీనివల్ల తహసీల్దార్లు, డిప్యుటీ కలెక్టర్లు ఇతర గ్రూప్​వన్​ఉద్యోగాలన్నీ ముస్లింలకే వస్తాయన్నారు.  టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని  ముస్లింలకు అప్పగిస్తోందని, ఇది రజాకార్ల పాలన కాదా అని ప్రశ్నించారు. తెలంగాణను  మళ్లీ నిజాం స్టేట్ చేస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా హిందూ సమాజం కండ్లు తెరవాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పిచ్చి తుగ్లక్​ జీఓలను రద్దు చేస్తామన్నారు. మంత్రి  కేటీఆర్​ ఓ పిచ్చివాడని, కానీ ఆయన ప్రజలందరినీ  పిచ్చివాళ్లనుకుంటున్నాడన్నారు. సుమారు రెండు లక్షల కోట్లు రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో ఎక్కువగా కట్టామని కేటీఆర్​ అబద్దాలు చెబుతున్నారన్నారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపేణా వచ్చిన దానికన్నా 28 వేల 300 పై చిలుకు కోట్లు అదనంగా రాష్ట్రానికి కేంద్రం ఖర్చు చేసిందన్నారు. ఎవరైనా గులాబీ వాళ్లు తన మీద దాడికి వస్తే తన సెక్యూరిటీ తుపాకీ పేలుతుందని హెచ్చరించారు. వడ్ల కొనుగోళ్లతో బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని ఆరోపించారు.