కారు స్టీరింగ్ ఇప్పటికీ ఎంఐఎం చేతిలోనే ఉంది: ఎంపీ అర్వింద్

కారు స్టీరింగ్ ఇప్పటికీ ఎంఐఎం చేతిలోనే ఉంది: ఎంపీ అర్వింద్

కారు స్టీరింగ్ (బీఆర్ఎస్ పార్టీ) ఇప్పటికీ ఎంఐఎం చేతిలో ఉందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని  తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నామని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి కేటీఆర్ అండతోనే రైస్ బ్లాక్ దందా నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేసి సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో తిరుగుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు మోడీ వ్యతిరేక శక్తులు ఏకమవ్వటం సర్వసాధారణమని, దీంతో తమకు వచ్చిన నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు ఎంపీ అర్వింద్. 

కాంగ్రెస్ లో భారీ చేరికలంటూ జరుగుతున్న ప్రచారం కేవలం మీడియా సృష్టేనని ఎంపీ అర్వింద్ చెప్పారు.  సీఎం కేసీఆర్ పని గట్టుకుని కాంగ్రెస్ కు హైప్ తీసుకొస్తున్నారని అన్నారు. ఇదంతా గులాబీ మీడియా పనేనని విమర్శించారు. రాష్ట్రంలో గులాబీ పార్టీకి ధీటుగా బీజేపీ పార్టీ మాత్రమే ఉందని.. కాంగ్రెస్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.  కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. 

ALSO READ:ICC ODI World Cup 2023: టీమిండియా మ్యాచ్‌లు, వేదికలు పూర్తి వివరాలివే

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినా ఖమ్మంలో మెజారిటీ స్థానాలన్నీ బీజేపీవేనని ఎంపీ అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. మీడియాలో చర్చ జరుగుతున్నంత సీన్ పొంగులేటికి లేదని చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో పర్యటించిన సందర్భంగా ఎంపీ అర్వింద్ ఈ కామెంట్స్ చేశారు.