
భారీ బలగాల మోహరింపుతో ఉదయం నుంచే ఉద్రిక్తత
రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చిన కార్మికులు, నాయకులు
మృతదేహాన్ని ఎత్తుకెళ్లి శ్మశానంలో పెట్టిన పోలీసులు
ఎంపీ బండి సంజయ్ గల్లా పట్టి లాగిన ఏసీపీ
ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతానన్న ఎంపీ.. ఫోన్లో పరామర్శించిన కిషన్రెడ్డి
పోలీసుల తీరుకు నిరసనగా సీపీ ఆఫీస్ ముందు అఖిలపక్షం ధర్నా
ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్ర ఉద్రిక్తంగా సాగింది. పోలీసుల ఓవరాక్షన్‌తో కరీంనగర్ రణరంగాన్ని తలపించింది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురు, శుక్రవారాల్లో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో కార్మికులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు హైడ్రామాకు తెరతీశారు. బాబు పనిచేసిన కరీంనగర్ 2 డిపోకు మృతదేహాన్ని తరలించేందుకు కుటుంబసభ్యులకు మొదట హామీ ఇచ్చి, తర్వాత ఒక వ్యూహం ప్రకారం దారి మళ్లించారు. మఫ్టీ పోలీసులతో పాడె మోయించి నేరుగా శ్మశానానికి తరలించారు. ఈ క్రమంలో రోప్‌వేను తోసుకెళ్లిన ఆందోళనకారులపై పోలీసులు చేయిచేసుకున్నారు. ఓ పోలీస్ ఉన్నతాధికారి ఎంపీ బండి సంజయ్ గల్లా పట్టి లాగడం, చెవిపట్టి లాగడం వివాదాస్పదమైంది.
రాష్ట్ర నలుమూలల నుంచి వెల్లువెత్తిన కార్మికులు..
డ్రైవర్ బాబు అంతిమయాత్రలో పాల్గొనేందుకు గురువారం నుంచే పెద్దసంఖ్యలో ఆర్టీసీ సంఘాల నాయకులు, అఖిల పక్ష నేతలు కరీంనగర్ చేరుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు అదే రోజు రాత్రి కార్మికులు, నాయకులను అక్కడి నుంచి ఎలాగైనా తరలించి అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. కానీ ఎంపీ బండి సంజయ్, కార్మిక సంఘాల నాయకుల పట్టుదలతో సాధ్యం కాలేదు. దీంతో శుక్రవారం ఉదయం ఎలాగైనా అంతిమసంస్కారాలు పూర్తయ్యేలా చూడాలని పోలీసులు నిర్ణయించారు. కానీ శుక్రవారం ఉదయం నుంచే కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు వరుసగా వచ్చి నివాళులు అర్పించడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అంతిమయాత్ర కుదరలేదు. దీంతో పోలీసులు లంచ్ చేశాక రంగంలోకి దిగారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించాలని పట్టుబట్టారు. కార్మికులు బాబు డెడ్‌బాడీని ఆయన చివరిసారిగా పనిచేసిన కరీంనగర్ 2 డిపోకు తరలిస్తామనీ, శాంతియుతంగానే కార్యక్రమం నిర్వహిస్తామని పోలీసులకు మాట ఇచ్చారు.
వ్యూహం ప్రకారం పక్కదారి..
కార్మికులు, నాయకులు హామీ ఇచ్చినా పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. బాబు ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభమై వంద మీటర్ల వరకు రాగానే పోలీసులు ముందస్తు పథకం ప్రకారం మృతదేహాన్ని తప్పించారు. మఫ్టీలో ఉన్న పోలీసులు పాడె మోస్తున్న ఆర్టీసీ కార్మికులను పక్కకు తప్పించి, తామే మోసుకుంటూ వేరేదారిలో శ్మశాన వాటికకు తరలించారు. శాంతియుతంగా అంతిమయాత్ర చేస్తామని చెప్పినా పోలీసులు వినకుండా మృతదేహాన్ని తప్పించిన పోలీసుల తీరుపై కార్మికులు, నాయకులు, కుటుంబసభ్యులు మండిపడ్డారు.
డిపో వైపు ర్యాలీ..
పోలీసులు మృతదేహాన్ని శ్మశానవాటిక వైపు మళ్లించడంతో కార్మికులు, నాయకులు ర్యాలీగా కరీంనగర్ డిపో వైపు తరలి వెళ్లారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. ర్యాలీగా వచ్చి కోర్టు చౌరస్తాలో బైఠాయించారు. తమపై పోలీసులు ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెప్పాలని ఎంపీ బండి సంజయ్ పట్టుబట్టారు. పోలీసులు ఎంపీ పై చేయి ఎత్తిన ఫొటోలు, మెడ చుట్టూ చేతులు వేసిన ఫొటోలు ప్రింట్ తీయించి ప్రదర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. అక్కడి నుంచి నేరుగా సీపీ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా చేరుకున్నారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుల వంటావార్పు
బాబు ఇంటి నుంచి ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ నేతలు ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద రోడ్డుపై ఇరువైపులా బైఠాయించి ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి తన మొండి వైఖరిని వీడి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అక్కడే ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ నాయకులు కూరగాయలు కోసి, రోడ్డు మీద పోయిరాళ్లు పెట్టి వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
ఎంపీకి క్షమాపణ చెప్పాలంటూ..
బాబు శవయాత్ర ఇంటి దగ్గరనుంచి ముందుకు సాగుతున్న క్రమంలో కొద్ది దూరం వెళ్లగానే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ పెద్దసంఖ్యలో కార్మికులు, నేతలు, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలున్నారు. అంత మందిలోనూ ఓ పోలీస్ అధికారి ఎంపీ సంజయ్‌ను గల్లా పట్టుకుని లాక్కుంటూ రావడం, మరో ఏసీపీ చెవి పట్టి లాగడం ఫొటోల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో సంజయ్ అనుచరులు అప్పటికప్పుడు ఆ ఫొటోలను అచ్చు వేయించి ధర్నా స్థలి వద్దకు తీసుకువచ్చి ప్రదర్శించారు. పోలీసుల దాష్టీకాలకు ఇవే నిదర్శనాలు అంటూ నేతలు మండిపడ్డారు. అక్కడే జరిగిన తోపులాటలో పోలీసులు, ఆందోళనకారులను ఇష్టారీతిగా కొడుతూ, గిచ్చుతూ ఇబ్బందులకు గురి చేశారు. తమదైన రీతిలో తమ ప్రతాపాన్ని చూపారు.
స్పందించకపోవడం దురదృష్టకరం: జీవన్ రెడ్డి
‘‘25 ఏళ్లుగా పనిచేసిన డిపో వద్దకు బాబు మృతదేహాన్ని తీసుకువెళ్లి చివరిసారి చూపించి తీసుకురావాలన్న కుటుంబసభ్యుల కోరికను పోలీసులు పట్టించుకోలేదు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడానికి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారు. ప్రభుత్వం కార్మికులకు సంబంధించి స్పష్టమైన అంశాలను కోర్టు ముందు ఉంచకపోవడం తో ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. 21 మంది కార్మికులు చనిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం. కేసీఆర్ దురుద్దేశంతో ఆర్టీసీ ప్రైవేట్‌పరం చేస్తే కార్మికుల తో పాటు ప్రజలు కూడా నష్టపోతారు. ప్రభుత్వం కుట్రపూరితంగా ఆర్టీసీ నష్టాల్లో ఉన్నట్లు చూపిస్తోంది. కార్మికులను ఉద్దేశపూర్వకంగా సమ్మె వైపు ప్రభుత్వం రెచ్చగొడుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశాన్ని తెర మీదికి తీసుకువచ్చింది కేసీఆరే. ఆర్టీసీ కార్మికులు అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని ఉద్యమిస్తున్నారు. కచ్చితంగా విజయం సాధించి తీరుతారు’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.
ఇవన్నీ ప్రభుత్వ హత్యలే: మాజీ ఎంపీ పొన్నం
‘‘ఆర్టీసీ కార్మికుల హఠాన్మరణం, ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నాం. కేసీఆర్‌పై హత్య కేసు నమోదు చేయాలి. 21 మంది కార్మికులు చనిపోయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. 24 గంటల్లో ఉద్యోగంలో జాయిన్ కాకపోతే డిస్మిస్ చేస్తానని సీఎం హెచ్చరించినా లెక్కచేయక పోరాటం చేస్తున్నారంటే అది ప్రభుత్వానికి చెప్పుదెబ్బలాంటిదే. కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీపై తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నదని కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఉద్యమకాలంలో నాటి తెలంగాణ మంత్రులంతా చేతగాని దద్దమ్మలు అని అప్పటి ఉద్యమకారులు విమర్శించారు. ఇప్పటి బంగారు తెలంగాణ మంత్రులు ఒక కుట్ర ప్రకారం ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. మా ఆందోళనకు కాల పరిమితి లేదు. పోలీసులు రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. నాటి 50 రోజులు సకల జనుల సమ్మె కాలంలో ఏ ఒక్క కార్మికుడినీ మా ప్రభుత్వం ఉద్యోగంలోంచి తొలగించలేదు. కేసీఆర్ మెట్టు దిగి వచ్చి కార్మికులతో చర్చలు జరపాలి. లేదంటే ఆయన కుర్చీ కిందికే నీళ్లు వస్తాయి’’ అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
ప్రభుత్వానికి పట్టింపులేదు: కోదండరాం
‘ప్రజారవాణా వ్యవస్థ పట్ల ప్రభుత్వ పట్టింపులేనితనం అనేక మంది ఆర్టీసీ ఉద్యోగుల ప్రాణాలను బలిగొంటోంది. ప్రభుత్వం ఎలాంటి మానవత్వం లేకుండా రాక్షసంగా వ్యవహరిస్తోంది. ఇకనైనా సర్కారు మెట్టు దిగాలి. కోర్టు సూచించినట్లు బాధ్యతగా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి, వారి సమస్యలు పరిష్కరించాలి’ అని టీజేఎస్ చీఫ్ కోదండరాం డిమాండ్ చేశారు.