రైతులను సన్నొడ్లు వేయమంటివి.. నువ్వు దొడ్డొడ్లు వేస్తివి

రైతులను సన్నొడ్లు వేయమంటివి.. నువ్వు దొడ్డొడ్లు వేస్తివి

వాళ్లకు జరిగిన నష్టం ఎవరు పూడుస్తరు : సంజయ్

హుజూరాబాద్, ఎల్కతుర్తి, వెలుగు: ‘‘సన్న వడ్లే పండిచాలని రైతులకు చెప్పావు. నీవు మాత్రం ఫాంహౌజ్‌లో  భూసార పరీక్షలు చేయించుకుని దొడ్డు వడ్లు పండించావు. సన్న వడ్లతో రైతులకు జరిగిన నష్టాన్ని ఇప్పుడు ఎవరు పూడుస్తరు?” అని సీఎం కేసీఆర్ పై బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ మండిపడ్డారు. వర్షాలతో రైతులు అరిగోస పడుతుంటే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.  మంగళవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్‍, సిర్సపల్లి, వరంగల్​అర్బన్​జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారంలో వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను ఆయన పరిశీలించారు. కేసీఆర్ వేయమన్న పంటలే వేశామని, పంటలు నష్టపోయినా ఒక్క ఆఫీసర్ కూడా రాలేదని రైతులు వాపోయారు. సూరారంలో పంట నీటమునిగిన ఓ రైతు పొలంలో పడి బోరున విలపించాడు. ఆ రైతును సంజయ్ పైకి లేపి, ఓదార్చారు. పంటల పరిశీలన అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే పూడ్చాలని డిమాండ్ చేశారు. భూసార పరీక్షలకు కేంద్రం రూ.125 కోట్లు ఇస్తే ఆ నిధులు ఏమయ్యాయో చెప్పడంలేదని మండిపడ్డారు. ఎకరాకు దొడ్డు వడ్లు 40 బస్తాలు వచ్చే కాడ ఇప్పుడు సన్న వడ్లు 30 బస్తాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. సీఎం తన ఫాంహౌజ్‌లో భూసార పరీక్షలు చేయించుకుని, దొడ్డు వడ్లు పండిస్తున్నాడని.. రైతులకు మాత్రం సన్న వడ్లే పండించాలని ఆగం చేశారన్నారు. వడ్లకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన ఫసల్ బీమాను అమలుచేసినా, రైతులకు పరిహారమైనా దక్కేదన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బీజేపీ నేతలు గంగాడి కృష్ణారెడ్డి, అన్నాడి రాజిరెడ్డి, మాడ వెంకట రెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా నేతలు చాడ శ్రీనివాస్​రెడ్డి, కుడుతాడి చిరంజీవి, బీట్ల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ కార్యకర్తల్లా పోలీసులు.. 

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సంజయ్ ఆరోపించారు. సోమవారం రాత్రి తమ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు వెహికల్ తనిఖీ సందర్భంలో పోలీసులు అత్యుత్సాహం చూపారన్నారు. ప్రస్తుత పరిస్థితిచూస్తే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే వాతావరణం కనిపించడంలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

బీజేపీలోకి టీఆర్ఎస్ నేత ఉడుత మల్లేశం  

రాష్ట్ర గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సీనియర్ నాయకుడు ఉడుత మల్లేశం యాదవ్‌‌‌‌ బీజేపీలో చేరారు. మంగళవారం బీజేపీ స్టేట్ చీఫ్​సంజయ్ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ సమక్షంలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మల్లేశం రెండు సార్లు డీసీసీబీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా, బీసీ సంక్షేమ సంఘం మాజీ  ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన మల్లేశం.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసం నామినేషన్ వెనక్కి
తీసుకున్నట్టు తెలిపారు.

ప్రాజెక్టుల తనిఖీకి టెక్నికల్ టీమ్‌ను పంపండి

కేంద్ర మంత్రి షెకావత్ కు సంజయ్ లేఖ 

రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు టెక్నికల్ టీమ్‌ను నియమించాలని కోరుతూ మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో డిజైన్ల లోపాలు, టెక్నికల్ ఫెయిల్యూర్స్ వల్లే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో ప్రమాదాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోందని తెలిపారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ నిర్మాణంకోసం పేలుళ్లు జరపడంతో కల్వకుర్తి లిఫ్ట్ స్కీం పంప్ హౌజ్ మునిగిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు. అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్‌తో టెక్నికల్‌గా, ఎకనమికల్‌గా నష్టమని నిపుణుల కమిటీ రిపోర్టు ఇచ్చినా, ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి చట్టబద్ధమైన అనుమతులు పొందకుండా, లోపభూయిష్టమైన డిజైన్లు, డీపీఆర్‌ల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌లను వెంటనే సమర్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

For More News..

కుండపోత వానలతో టెన్షన్​లో గ్రేటర్​ హైదరాబాద్​ జనం

ముంపు ప్రాంతాల్లో వారిని కాపాడేందుకు బోట్లు వచ్చినయ్