సీఎం కేసీఆర్ కేసులపైనే ఆరా తీస్తున్నాం

సీఎం కేసీఆర్ కేసులపైనే ఆరా తీస్తున్నాం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై ఉన్న కేసుల గురించి ఆరా తీస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. ఆయనను ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమకు ఓ వ్యూహం ఉందన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేసీఆర్ పై కేసులతోపాటు బీజేపీలో ఈటల రాజేందర్ చేరిక మీదా సంజయ్ క్లారిటీ ఇచ్చారు.

'టీఆర్ఎస్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. అదే నిజమైతే మేం ప్రత్యామ్నాయం ఎలా అవుతాం? ఇప్పుడు టీఆర్ఎస్సే బీజేపీకి ప్రత్యామ్నాయం. ఈ విషయంలో ఢిల్లీలో జేపీ నడ్డా కూడా ఈటలకు చాలా క్లారిటీ ఇచ్చారు. మాకు TRS కు ఎలాంటి సంబందాలు లేవన్నారు. భవిష్యత్ లో కూడా TRSతో దోస్తానా ఉండదు. కేసీఆర్ గద్దె దిగే వరకు మేం పోరాటం ఆపబోం' అని బండి సంజయ్ పేర్కొన్నారు.

కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తెలిసింది

'రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారంపై లీగల్ గా చర్చించాం. 18 మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై RTAలు వేసి వివరాలూ సేకరించినం. లాక్ డౌన్ కాగానే బీజేపీ ఆందోళనలు చేస్తుంది. ఇతర పార్టీలు చేసే విమర్శలు మేము పట్టించుకోం. మా ఉద్యమ పంథానే వేరుగా ఉంటుంది. సీఎం కేసీఆర్ సహారా , ESI కేసుల వివరాలు పూర్తిగా తీస్తున్నాం. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కేసుల పైనే ఆరా తీస్తున్నాం. ఇవన్నీ కేసులను చూశాకే సీఎం కేసీఆర్ ఇంత పెద్ద అవినీతి పరుడని తెలిసింది' అని బండి సంజయ్ విమర్శించారు.

మరో వారంలో బీజేపీలోకి ఈటల

'మరోవారంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారు. పార్టీ నిబంధనల ప్రకారంబీజేపీలోకి వస్తే రాజీనామా చేయాల్సిందే. ఇందుకు అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఈ రోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ (సంస్థాగత) ను ఈటల కలుస్తారు. హైదరాబాద్ కు తిరిగి రాగానే రాజీనామా పై చర్చ జరుపుతాం. ఎలాంటి హామీ లేకుండానే ఈటల బీజేపీలో చేరుతున్నారు. బీజేపీలో ఎవ్వరు చేరినా ఎలాంటి హామీ ఉండదు. బీజేపీ సిద్ధాంతాలతోపాటు ప్రధాని మోడీ పాలన నచ్చి ఈటల పార్టీలో చేరుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ మంచి వేదిక అని భావిస్తున్నారు' అని సంజయ్ చెప్పారు.