కేసీఆర్.. ఎంతమందిని జైళ్ల పెడ్తవో చూస్తం

కేసీఆర్.. ఎంతమందిని జైళ్ల పెడ్తవో చూస్తం
  • జైళ్లకు పోయేందుకు భయపడం: సంజయ్

కామారెడ్డి , వెలుగు: ‘‘తెలంగాణలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం రావాలి. ఇది బీజేపీతోనే సాధ్యం. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి” అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్​ నేత మాల్యాద్రిరెడ్డి, పలువురు ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బాన్స్​వాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘మేం ఏవరినీ రెచ్చగొట్టం. బీజేపీ రెచ్చగొట్టడం మొదలుపెడితే టీఆర్ ఎస్​ కనుమరుగైతది. రాష్ట్రంలో ప్రెండ్లీ పోలీసింగ్ పోయింది. బీజేపీ వాళ్లను కొట్టుమని లాఠీలు ఇచ్చిన్రట. కేసీఆర్.. ఇప్పుడున్న లాఠీలు సరిపోవు. జైళ్లకు పోయేందుకు మేం భయపడం. ఎంతమందిని జైలుకు పంపుతవో చూస్తం. కొత్త జైళ్లు, లాఠీలకు ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ఫండ్స్ పెట్టుకో. పోలీసులకు మేం వ్యతిరేకం కాదు. కానీ కొందరు పోలీసులు ప్రమోషన్ల కోసం రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నరు” అని అన్నారు.

బాన్స్​వాడలో మాఫియా రాజ్యం

బాన్స్​వాడలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఒకే నంబర్​తో 10, 15 లారీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తూ దోచుకుంటున్నారన్నారు. ఈ అక్రమాన్ని అడ్డుకుంటే లారీలతో గుద్దుతున్నారన్నారు. బాన్స్​వాడలో ఓ పెద్దమనిషి ఉండని, ఆయనకు ఇద్దరు కొడుకులతో సన్​స్ట్రోక్ ఉందన్నారు. ఆ పెద్దమనిషి కొడుకులు నియోజకవర్గాన్ని పంచుకొని రాజ్యమేలుతున్నరని విమర్శించారు. పోలీసు కాన్వాయ్ పెట్టుకొని తిరుగుతున్నారన్నారు. ‘‘మేం ఎంపీలం వస్తే కూడా సెక్యూరిటీ కోసం ఒక్క పోలీసు రాలేదు. కార్యకర్తలే మాకు రక్షణ’’ అన్నారు. చావుకు బండి సంజయ్ భయపడడని… చావే సంజయ్​కు భయపడుతుందన్నారు. బాన్స్​వాడలో బీజేపీ కార్యకర్తల జోలికొస్తే అర్ధరాత్రి అయినా వస్తానన్నారు.

గబ్బిలాల పీడ వదలాలి: ఎంపీ అర్వింద్ 

రూ.500 కోట్లు ఖర్చుచేసి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నాడు మొక్కలు నాటారని, ఒక వైపు ప్రకృతి వనరుల్ని కొల్లగొడుతూ మరో వైపు మొక్కలు నాటడం ఏమిటని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. టీఆర్​ఎస్ చెప్పే బంగారు తెలంగాణ అంటే దోచుకొవడమేనని విమర్శించారు. ప్రతి స్కీమ్ పేరు అట్లనే ఉందన్నారు. యంత్రలక్ష్మీ స్కీమ్‌‌‌‌తో పోచారం ఇంట్లో పైసలు గలగలలాడాయన్నారు. వాళ్ల షోరూమ్​లోనే ట్రాక్టర్లు కొనాలని సర్పంచులకు హుకూం జారీ చేశారన్నారు. లేదంటే చెక్ పవర్ రద్దు చేస్తామని బెదిరించారన్నారు. బాన్స్​వాడకు పట్టిన గబ్బిలాల పీడ వదలాలన్నారు. బాన్స్​వాడకు పోచారం గ్రహచారం పట్టిందన్నారు. ఈ గ్రహచారం పోయే రోజు దగ్గరలోనే ఉందన్నారు. మంజీర నుంచి ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఇసుక మాఫియానే వీఆర్​ఏ సాయిలును తొక్కించి చంపిందన్నారు. సభలో యెండెల లక్ష్మీనారాయణ, పల్లె గంగారెడ్డి, అరుణతార, బస్వా లక్ష్మీనర్సయ్య, శ్రీశైలంగౌడ్​, మురళీధర్​గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.