ప్రభుత్వానికి భూములమ్మే అధికారం లేదు

ప్రభుత్వానికి భూములమ్మే అధికారం లేదు
  • సంరక్షకుడిగా ఉండాలి తప్ప.. అమ్మే అధికారం ఉండదు
  • ప్రజాప్రయోజనాల కోసం భూములను వాడుకోవాలి
  • భూములు అమ్మడమంటే తెలంగాణ ప్రజలను నట్టేట ముంచడమే
  • భూమాఫియా మొత్తం టీఆర్ఎస్‌లోనే ఉన్నారు
  • భూముల అమ్మకం ఆపకపోతే ప్రజా ఉద్యమం చేస్తాం
  • బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయ వనరుల కోసం ప్రభుత్వ భూములు అమ్మడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వ భూములకు రాష్ట్ర ప్రభుత్వం సంరక్షకుడిగా ఉండాలి తప్ప.. వాటిని అమ్మే అధికారం ఉండదని ఆయన అన్నారు. ‘ప్రభుత్వ భూమి అనేది తెలంగాణ ప్రజల ఆస్తి. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను ప్రజల సౌకర్యాల కోసం ఉపయోగించాలే తప్ప అమ్మడం అనేది అనైతికం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం కోసం, విద్యాలయాల నిర్మాణం కోసం, శాస్త్ర సాంకేతిక పరిశోధనల కోసం, స్టేడియంల నిర్మాణం కోసం, బస్ స్టేషన్ల నిర్మాణం కోసం, కనీసం గిడ్డంగుల కోసమైన ఉపయోగించుకోవాలి తప్ప.. అమ్మడం సరైంది కాదు. ఇది ఒక రకంగా భావితరాలకు నష్టం చేయడమే. భవిష్యత్ తరాల కోసం, ప్రజోపయోగ కార్యక్రమాల కోసం భూములను రక్షించాల్సిన ప్రభుత్వం.. హైదరాబాద్, ఇతర నగరాల చుట్టూ ఉన్న విలువైన భూములను అమ్మాలని నిర్ణయించడం తెలంగాణ ప్రజలను నట్టేట ముంచడమే అని బీజేపీ భావిస్తోంది.

ఇప్పటికే పలు ప్రభుత్వ, అసైన్డ్, శిఖం, అటవీ, దేవాదాయ, భూదాన, వక్ఫ్, భూసంస్కరణల మిగులు తదితర భూములు అన్యాక్రాంతం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాంటి భూములను రక్షించలేని ప్రభుత్వం.. ఉన్న భూములను కూడా అమ్మాలని నిర్ణయించడం తెలంగాణ ప్రజల పాలిట శాపమని బీజేపీ భావిస్తోంది. భూముల అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాల రెవెన్యూగా మార్చుకోవాలనుకోవడం దురదృష్టకరం.

ఈ భూ అమ్మకాలకు వ్యతిరేకంగా గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ లోపల, బయట ఉద్యమాలు నిర్వహించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు భూకబ్జాలకు పాల్పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌లో ఉన్న భూమాఫియా మొత్తం నేడు టీఆర్ఎస్ పార్టీలో నాయకులుగా చలామణి అవుతున్నారు. వారి కబ్జాలో ఉన్న భూమిని చట్టపరంగా విడిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజాప్రయోజనాల కోసం భూమిని ఉపయోగించుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అలా కాకుండా.. తమ ఇష్టానికి భూములు అమ్ముతామంటే.. ప్రజా ఉద్యమాన్ని, రాజకీయ ఉద్యమాన్ని తీసుకురావడమే కాకుండా న్యాయ పోరాటం కూడా చేస్తుందని బీజేపీ హెచ్చరిస్తుంది’ అని ఆయన అన్నారు.