బీఆర్ఎస్​కు డిపాజిట్లు కూడా రావు : కిషన్ రెడ్డి

బీఆర్ఎస్​కు డిపాజిట్లు కూడా రావు : కిషన్ రెడ్డి
  • కేంద్రంలో మరోసారి వచ్చేది మోదీ ప్రభుత్వమే
  • హిమాయత్​నగర్​లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం

బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైందని, లోక్​సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్​బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్​రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్​కు ఓటు వేస్తే వృథా అవుతుందని, ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. సోమవారం ‘ఇంటింటికీ బీజేపీ’ పేరిట హిమాయత్ నగర్ పరిధిలోని ముత్యాలబాగ్​లో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ప్రజలను కలుస్తూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. దేశ ప్రజలు మరోసారి మోదీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఇండియా కూటమిని నడిపించే దిక్కు లేదని, కేంద్రంలో కాంగ్రెస్​పార్టీ గెలిచేది లేదు.. చచ్చేది లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్​కు 40 ఎంపీ సీట్లకు మించి రావన్నారు. బీజేపీ 400కు పైగా సీట్లు గెలుస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు ప్రేమ్ సింగ్ రాథోడ్ , గౌతమ్ రావు, ఎన్వీ సుభాశ్, వీరెల్లి చంద్రశేఖర్, నర్సింగ్ ముదిరాజ్, కేశబోయిన శ్రీధర్, జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పద్మారావునగర్: సోమవారం రాత్రి బన్సీలాల్ పేట సీసీనగర్, పద్మారావునగర్​కిషన్​రెడ్డి జీప్​యాత్ర నిర్వహించారు. ఆయన వెంట మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి,  ఎమ్మార్పీఎస్​వ్యవస్థాపక అద్యక్షులు మందకృష్ణ మాదిగ, బీజేపీ నేతలు శ్యాంసుందర్​ గౌడ్, టి.రాజశేఖర్​ రెడ్డి, ఆనంద్​ యాదవ్, హరినాథ్  పాల్గొన్నారు.