- ఎంపీ చామల వెల్లడి
- బాలుడి తండ్రికి ఫోన్ చేసి పరామర్శ
న్యూఢిల్లీ, వెలుగు: భువనగిరి పట్టణం తారకరామా నగర్‌లో వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రియాంష్ ఉదంతంపై స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. పార్లమెంట్ సమావేశాల నిమిత్తం ఢిల్లీలో ఉన్న ఆయన.. శుక్రవారం బాలుడి తండ్రి రాహుల్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రియాంశ్ కు జరుగుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్న ఎంపీ.. చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రుల్లో బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే తాను స్వయంగా వెళ్లి బాలుడిని పరామర్శిస్తానని, ఆ కుటుంబానికి వ్యక్తిగతంగానూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి విడుదల చేసిన ఓ ప్రకటనలో అధికారులకు ఎంపీ చామల పలు కీలక సూచనలు చేశారు. యానిమల్ బర్త్ కంట్రోల్ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
