కిషన్ రెడ్డి, బండి సంజయ్ గ్లోబల్ సమిట్కు అటెండ్ కావాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కిషన్ రెడ్డి, బండి సంజయ్  గ్లోబల్ సమిట్కు అటెండ్ కావాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  •     తెలంగాణ ప్రజల దృష్టిలో విలన్లు కావొద్దు: ఎంపీ చామల

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రజల దృష్టిలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విలన్లు కావొద్దని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. సీఎం రేవంత్ నేతృత్వంలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్​కు హాజరుకావాలని సూచించారు. 

ఈ సమిట్​కు హాజరవుతున్న ప్రతినిధులకు కేంద్ర మంత్రులు భరోసా కల్పించాలన్నారు. ఆదివారం చామల మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రేవంత్ గ్లోబల్ సమిట్​కు శ్రీకారం చుట్టారు. 

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కుదేలైన వ్యవస్థలను ఆయన గాడిన పెట్టారు. బీఆర్ఎస్ పాలనలో తప్పులు జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు సైలెంట్​గా ఉన్నారు? కేంద్రం నుంచి తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు తీసుకొస్తే.. రూ.8 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయింది? గత ప్రభుత్వం చేసిన అప్పులకు మేము ప్రతి నెలా రూ.

8వేల కోట్లు వడ్డీ కింద కడ్తున్నం. తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటుంటే కిషన్ రెడ్డి ఎందుకు రాష్ట్రాన్ని కాపాడలేదు? తెలంగాణ ప్రజల ఓట్లతోనే కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు’’అని చామల అన్నారు. కిషన్ రెడ్డి చెప్పే లెక్కలన్నీ తప్పులే అని, రూ.13 లక్షల కోట్లు తీసుకొస్తే లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఇండిగో పై చర్యలు తీసుకోవాల్సింది పోయి... ఆ సంస్థ ఒత్తిళ్లకు కేంద్రమే దిగొచ్చిందన్నారు. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొత్త రూల్స్​కు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. రీఫండ్ చేసి చేతులు దులుపుకుందామని ఇండిగో సంస్థ చూస్తున్నదని విమర్శించారు. ఈ సంక్షోభంపై కేంద్రం, విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.