పసుపు బోర్డు హామీ నిలబెట్టుకున్నా : ఎంపీ ధర్మపురి అరవింద్

పసుపు బోర్డు హామీ నిలబెట్టుకున్నా : ఎంపీ ధర్మపురి అరవింద్

జగిత్యాల టౌన్, వెలుగు : బీజేపీ నుంచి జగిత్యాల మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న భోగ శ్రావణిని గెలిపించాలని ఓటర్లను ఎంపీ అరవింద్  కోరారు. బీజేపీ అభ్యర్థి శ్రావణి బుధవారం అర్వింద్ తో కలిసి నామినేషన్  వేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అర్వింద్  మాట్లాడూతూ పసుపు బోర్డు తెస్తానని తాను మాట ఇచ్చి నిలబెట్టుకున్నానని చెప్పారు. అలాగే ఎమ్మెల్యేగా శ్రావణిని అసెంబ్లీలో కూర్చోపెడతానని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్  అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తన వయసంత రాజకీయ అనుభవం ఉన్నా ఒక్క బీసీకైనా టికెట్ ఇప్పించారా అని ప్రశ్నించారు. తమ పార్టీ మాత్రం నిజామాబాద్  పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు రెడ్లకు, మూడు బీసీలకు, ఒకటి ఆర్యవైశ్యకు అవకాశం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్  పార్టీకి 30 సీట్లు కూడా రావన్నారు. ఇక రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని, కంటి డాక్టర్ గా పేరున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్  కుమార్  వెళ్లి సీఎం కేసీఆర్ కు కళ్లు చెక్ చేసి కనిపించేలా చేయాలని సూచించారు.

తెలంగాణలో రాబోయేది  బీజేపీ ప్రభుత్వమే 

కోరుట్ల,వెలుగు : రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ఎంపీ, కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ అన్నారు. కేంద్రంలో, రాష్ర్టంలో డబుల్  ఇంజన్  బీజేపీ సర్కారుతోనే అభివృద్ది సాధ్యమని ఆయన పేర్కొన్నారు. బుధవారం కోరుట్లలోని పార్టీ ఆఫీసులో లీడర్లతో అర్వింద్  సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి బీజేపీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్​ జేఎన్​ వెంకట్  ఆధ్వర్యంలో మల్లాపూర్​ మాజీ జడ్పీటీసీ  నానం రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ కోరుట్ల రాములు, ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ తేలు లక్ష్మి, ముత్తన్న, నాయకులు సాయన్న బీజేపీలో చేరారు. వారికి అర్వింద్​ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.