మక్తల్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం మక్తల్ మండలం సామాన్‌పల్లి గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలోని జీపీ, అంగన్‌వాడీ, మహిళా సంఘాల భవనాలతో పాటు సీసీ రోడ్లు, పీఎంజీఎస్‌వై పనులకు కేంద్రమే 60 శాతం నిధులు ఇస్తోందన్నారు.
అమృత్ పథకం ద్వారా డ్రైనేజీలు, తాగునీరు, చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో భూసేకరణ జరగకపోవడం వల్లే రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో పడ్డాయని ఆరోపించారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలకు పాలమూరు, -రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం చేతకాలేదని విమర్శించారు.
