
అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. బుధవారం జోగులాంబ ఆలయాన్ని ఎంపీ దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో దీప్తి, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగులాంబ స్టేషన్లో ప్రతి రైలు ఆగేలా చూడాలని, ఒక రైలుకు జోగులాంబ ఎక్స్ప్రెస్ గా నామకరణం చేయాలని ఆలయ పాలకమండలి సభ్యులు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర నిధులతో జోగులాంబ క్షేత్రానికి పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యేలా చూస్తానని చెప్పారు.
జీఎస్టీ తగ్గింపు పేదలకు వరం..
గద్వాల: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో పేదలకు ముందే దసరా పండుగ వచ్చినట్లయిందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. బుధవారం గద్వాలలో జీఎస్టీ ఫెస్టివల్ మేళాను సందర్శించారు. జీఎస్టీ స్లాబ్లు తగ్గడంతో కార్లు, బైకులు, టీవీలు, ఫ్రిజ్ ల అమ్మకాలు పెరిగాయని తెలిపారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో ధరూర్ మండలం అలవలపాడు గ్రామస్తులు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. వారికి ఎంపీ కాషాయం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీకే స్నిగ్దారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, వెంకటేశ్వర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, శివారెడ్డి, అనిమి రెడ్డి, అశోక్ పాల్గొన్నారు.