V6 News

మంచిర్యాల మెడికల్ కాలేజీకి రెండు బస్సులు ..పెద్దపల్లి ఎంపీ ఫండ్స్ నుంచి రూ.80 లక్షలు కేటాయింపు

మంచిర్యాల మెడికల్ కాలేజీకి రెండు బస్సులు ..పెద్దపల్లి ఎంపీ ఫండ్స్ నుంచి రూ.80 లక్షలు కేటాయింపు
  •    కొనుగోలు కోసం కలెక్టర్​కు లేఖ ఇచ్చిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  •     వైద్య విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి సౌకర్యం

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల మెడికల్​ కాలేజీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి రవాణా సదుపాయాల కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలక చర్యలు చేపట్టారు. వైద్యకళాశాల కోసం ప్రత్యేకంగా రెండు బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్కటి రూ.40 లక్షల చొప్పున మొత్తం రూ.80 లక్షలు అవసరం కాగా.. ఆ మొత్తం ఎంపీల్యాడ్​ నిధుల నుంచి కేటాయిస్తున్నట్లు మంగళవారం వంశీకృష్ణ స్పష్టం చేశారు..

 ఈ మేరకు ఆయన మంచిర్యాల కలెక్టర్​ కుమార్ ​దీపక్​కు లేఖ రాశారు. ఎంపీ నిధుల నుంచి ఫండ్స్ సాంక్షన్​ చేసి కాలేజీకి అవసరమైన రెండు బస్సులు కొనుగోలు చేయాలని సూచించారు. గత నెల 21న మంచిర్యాల జిల్లా గుడిపేటలోని మెడికల్​ కాలేజీని ఎంపీ వంశీకృష్ణ సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తమకు రవాణా సదుపాయాలు సరిగా లేవని, రెండు బస్సులు ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారమవుతుందని ఎంపీకి విన్నవించారు. 

స్పందించిన ఆయన రెండు బస్సుల కోనుగోలుకు తన నిధుల నుంచి మంజూరు చేయాలని కలెక్టర్​కు లేఖ రాశారు. ఈ రెండు బస్సులు మెడికల్​ స్టూడెంట్స్, ఇంటర్న్స్, ఫ్యాకల్టీ ఎదుర్కొనే ఇబ్బందులను తీరుస్తాయని పేర్కొన్నారు. రెండు బస్సులకు నిధులు మంజూరు చేయడం పట్ల ఎంపీ వంశీకృష్ణకు మెడికల్​ విద్యార్థులు, అధ్యాపకులు ధన్యవాదాలు తెలిపారు.