- మంత్రి శ్రీధర్‌బాబు, పార్టీకి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లేఖ
- ఇటీవల కొయ్యూరులో పేద విద్యార్థులకుస్కూల్ బ్యాగుల పంపిణీ
- ఎంపీతో కలిసి పాల్గొన్నందుకు వార్డు సభ్యురాలు, ఉప సర్పంచ్ సస్పెన్షన్
హైదరాబాద్, వెలుగు: మంథని నియోజకవర్గంలోని కొయ్యూరులో తనతో కలిసి నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసినందుకు ఉపసర్పంచ్, వార్డు సభ్యురాలిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిద్దరిపై సస్పెన్షన్ ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు లేఖ రాశారు. ఇటీవల కొయ్యూరులో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో ఎంపీ వంశీకృష్ణతో కలిసి పాల్గొన్న ఉపసర్పంచ్ లకావత్ సవేందర్, మహిళా వార్డు సభ్యురాలు లకావత్ లక్ష్మిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యను తప్పుపడుతూ ఎంపీ తన లేఖలో పలు అభ్యంతరాలు లేవనెత్తారు. లకావత్ లక్ష్మి కుటుంబం గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నదని, ఆమె భర్త తిరుపతి నాయక్ కూడా పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం శ్రమించిన గిరిజన కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి, సస్పెన్షన్ విధించడం అన్యాయమని అన్నారు.
ఒక ఎంపీని కలవడం, పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసే సేవా కార్యక్రమంలో పాల్గొనడం పార్టీ వ్యతిరేక చర్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా, వివరణ కోరకుండా ఏ పార్టీ నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్ చేశారో స్పష్టం చేయాలని కోరారు. కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగినప్పుడే కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందని, ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు పార్టీ ఐక్యతకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరిపై సస్పెన్షన్ ఎత్తివేయడంతోపాటు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని లేఖలో ఎంపీ వంశీకృష్ణ కోరారు.
