
కోల్ బెల్ట్/న్యూఢిల్లీ, వెలుగు: నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ వెంటనే తన పదవికి రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. నీటి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాలో తెలంగాణ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్, రఘువీరా రెడ్డి పాల్గొన్నారు.
నీట్ పేపర్ లీకేజీ నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ, అవకతవకలపై కేంద్రం వెంటనే విచారణ జరిపించాలన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించనున్నట్టు చెప్పారు. పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు నీట్ స్కామ్ బయటపడి ఉంటే కేంద్రంలో కచ్చితంగా ఎన్డీఏ సర్కార్ వచ్చేది కాదన్నారు. పేపర్ లీక్ చేసి బతకడం ఒక బతుకే కాదని వంశీకృష్ణ పేర్కొన్నారు. లీక్ వ్యవహారంలో బీజేపీ ఎంపీల కుటుంబ సభ్యుల పేర్లు బయటకు వస్తాయనే నీట్ రద్దు చేయడం లేదని ఇతర ఎంపీలు ఆరోపించారు.