పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. కొలనూరు రైల్వే గేట్ వద్ద గత వారం రోజులుగా జరుగుతున్న రైల్వే లైన్ మరమ్మత్తు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కొలనూరు గ్రామంలోని చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎంపీ.. మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం అందిస్తుండటం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.అక్కడి నుండి పెద్దపల్లి పట్టణంలోని కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన వంశీకృష్ణ.. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ALSO READ : రేవంత్ రెడ్డి పిటిషన్ల పై హైకోర్టు నోటీసులు
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు.దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 9 విమానాశ్రయాలు ఉంటే, తెలంగాణలో కేవలం రెండు మాత్రమే ఉండటం ఏంటని పార్లమెంటులో ప్రశ్నించానని ఎంపీ తెలిపారు.తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ యూనిట్‌ను ఏపీకి కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉపాధినిచ్చే ఈ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఎంపీ వంశీకృష్ణ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల సాధన కోసం పార్లమెంటులో గళం వినిపిస్తానని పునరుద్ఘాటించారు.
