- కార్మికులకు న్యాయం చేయండి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి
కోల్బెల్ట్, వెలుగు: సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్యకు సింగరేణి యాజమాన్యం తక్షణమే పరిష్కారం చూపాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే పవర్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీకి అనేకసార్లు లెటర్లు రాసినట్టు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు చెప్పారు. సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే కోర్టు కేసులు ఉన్నాయంటూ సాకులు చెప్పడం సరికాదని మంగళవారం ఓ వీడియోలో పేర్కొన్నారు.
కార్మికులు అనేకసార్లు ధర్నాలు, నిరసనలు తెలిపారన్నారు. సింగరేణి సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కులను రక్షించేందుకు మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి చేసిన కృషిని, పోరాటాలను ఆయన గుర్తుచేశారు. కార్మికుల కష్టాన్ని పట్టించుకోకుండా అధికారుల నిర్ణయాలతో సంస్థను నడపడం సరైన విధానం కాదని, దీనివల్ల భవిష్యత్తులో సింగరేణికి ఇబ్బందులు వస్తాయని చెప్పారు. దేశంలోనే సింగరేణి కీలకమైన సంస్థ అని, సింగరేణి నడిస్తేనే ఈ దేశానికి వెలుగన్నారు. సింగరేణిని, కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, వెంటనే కార్మికులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సింగరేణి యాజమాన్యాన్ని వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకోస్తామన్నారు.
