ఉపాధి కోల్పోయిన కూలీల కోసం జాబ్​ఫెయిర్స్

ఉపాధి కోల్పోయిన కూలీల కోసం జాబ్​ఫెయిర్స్
  • మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం
  • వచ్చే వారం నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడి

భోపాల్: లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీలు, కార్మికుల కోసం జాబ్ ఫెయిర్స్ నిర్వహించనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్​కు వచ్చిన వారికి, స్థానిక కూలీలకు పని కల్పించాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకుందని ఒక సీనియర్ అధికారి శనివారం మీడియాకు తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్లు జూన్ మూడవ వారం నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. ఫ్యాక్టరీ యజమానులు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ప్లేస్‌మెంట్ ఏజెన్సీలతో.. కూలీలు ప్రత్యక్షంగా సంప్రందించేలా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సొంతూళ్లకు తిరిగి వెళ్లిన కార్మికులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుందని, అలా వచ్చిన వారికి జాబ్ ఫెయిర్ పూర్తయ్యే వరకు భోజనం, వాటర్ సప్లై చేస్తుందన్నారు. అంతకు ముందు రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ రోజ్​గార్ సేతు పోర్టల్ ద్వారా 302 మంది వలస కూలీలకు ఉద్యోగాలు లభించాయని అన్నారు. ఈ పోర్టల్ లో రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ప్లేస్‌మెంట్ ఏజెన్సీలకు చెందిన 10,000 మంది యజమానులు తమ పేర్లు పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని చెప్పారు.