హైదరాబాద్ తిరుపతి మధ్య విమాన టికెట్ చార్జీలు తగ్గించాలని కోరుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉడాన్ లక్ష్యాల్లో ఒకటైన సామాన్యుడికి విమానయానం ఆశయానికి విరుద్ధంగా విమాన టికెట్ ధరలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు గురుమూర్తి. దేశంలోని ప్రధాన నగరాల కంటే తిరుపతికి విమాన టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని అన్నారు.
హైదరాబాద్ ముంచి పలు నగరాలకు విమాన టికెట్ ధరలు:
- హైదరాబాద్ నుంచి గోవా :రూ. 3వేలు - 6వేల 500
- హైదరాబాద్ నుంచి చెన్నై : రూ. 2వేల 500 - 4వేలు
- హైదరాబాద్ నుంచి ఢిల్లీ: రూ. 3వేల 900 - రూ. 7వేలు
- హైదరాబాద్ నుంచి తిరుపతి: రూ. 6వేలు - రూ.9 వేలు
ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ తిరుపతి మధ్య విమాన టికెట్ ధరలు అత్యధికంగా ఉన్నాయని.. కొన్ని సందర్భాల్లో ఇది రూ. 14 వేల 500కు చేరుతోందని అన్నారు గురుమూర్తి. ఏప్రిల్ 2025 నుంచి మర్చి 2026 వరకు 13 వేల 367 విమానాల్లో దాదాపు 11 లక్షల 84 వేల మంది ప్రయాణికులు హైదరాబాద్-తిరుపతి రూట్లో ప్రయాణించారని పేర్కొన్నారు. కేవలం,ఈ ఏడాది మార్చి నెలలోనే 864 విమానాల ద్వారా 88 వేల మంది హైదరాబాద్ తిరుపతి మధ్య ప్రయాణించారని.. ఈ రూట్లో రోజుకు 16 నుంచి 17 విమానాలు నడుస్తున్నాయని అన్నారు. దీన్ని బట్టి డిమాండ్ ఏ స్థాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ఈ స్థాయిలో డిమాండ్ ఉన్నప్పటికీ విమానయాన సంస్థలు తెలివిగా పెద్ద విమానాల సంఖ్యను తగ్గించి చిన్న విమానాలు నడుపుతూ సీట్ల కొరత సృష్టిస్తున్నాయని అన్నారు. తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల్లో మధ్యతరగతి వారే ఎక్కువగా ఉంటారని.. వారిపై ఆర్థికభారం మోపడం అన్యాయం అని అన్నారు ఎంపీ గురుమూర్తి.

