గరంగరంగా యాదాద్రి జిల్లా దిశ మీటింగ్‌‌

గరంగరంగా యాదాద్రి జిల్లా దిశ మీటింగ్‌‌
  • ప్రొటోకాల్‌‌, వర్క్స్‌‌ కేటాయింపుపై ఎంపీ కోమటిరెడ్డి ఆగ్రహం

యాదాద్రి, వెలుగు :‘సెంట్రల్‌‌ గవర్నమెంట్‌‌ ఫండ్స్‌‌తో నిర్మించే పనుల్లో నాణ్యత పాటించడం లేదు.. ఈ విషయాన్ని సెంట్రల్‌‌ మినిస్టర్లు, స్పీకర్‌‌తో పాటు సెంట్రల్‌‌ విజిలెన్స్‌‌ కమిటీకి ఫిర్యాదు చేస్తా.. తెలంగాణలో జరుగుతున్న విషయాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తా... అవసరసరమైతే ఫండ్స్‌‌ ఆపమని చెబుతా’ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి హెచ్చరించారు. ప్రోటోకాల్‌‌ విషయంలో పార్టీలను ప్రామాణికంగా తీసుకోవద్దని సూచించారు. భవిష్యత్‌‌లో ఇలాగే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. తీరు మార్చుకోకుంటే వచ్చే మీటింగ్‌‌కు రానని చెప్పారు. శుక్రవారం భువనగిరిలో జరిగిన యాదాద్రి జిల్లా దిశ మీటింగ్‌‌ హాట్‌‌హాట్‌‌గా సాగింది. మీటింగ్‌‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌‌ ఎలిమినేటి సందీప్‌‌రెడ్డి హాజరయ్యారు. మీటింగ్‌‌ ప్రారంభం కాగానే ఆత్మకూర్‌‌ (ఎం) సర్పంచ్‌‌ జెన్నాయికోడి నగేశ్‌‌ మాట్లాడుతూ ఉపాధి పనులను టీఆర్‌‌ఎస్‌‌ వాళ్లకు మాత్రమే కేటాయిస్తున్నారని ఆరోపించారు. స్పందించిన జడ్పీ చైర్మన్‌‌ ఎలిమినేటి సందీప్‌‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ పవర్‌‌లో ఉంటే ఆ పార్టీ వాళ్లకే పనులు ఇవ్వడం సాధారణమేనని, గతంలో కాంగ్రెస్‌‌ హయాంలో ఆ పార్టీ లీడర్లకే 50 శాతం పనులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విషయాలు ఇప్పుడు అవసరం లేదని, తెలంగాణలో అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వలిగొండ ఎంపీపీ నూతి రమేశ్‌‌ మాట్లాడుతూ మండలానికి ఏ ఒక్క పనీ మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్‌‌ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధి పనులకు సర్పంచ్‌‌లను పిలవకుండా, ప్రొటోకాల్‌‌ పాటించకుండా ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, కలెక్టర్‌‌ పమేలా సత్పతి, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ దీపక్‌‌ తివారి, డీఆర్డీవో ఉపేందర్‌‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రతి పథకంలో కేంద్ర నిధులున్నయ్‌‌
తాను ప్రపోజ్‌‌ చేసిన పనులను కూడా అంగీకరించక పోవడంపై ఎంపీ కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సెంట్రల్‌‌ గవర్నమెంట్‌‌ వాటా లేకుండా రాష్ట్రంలో ఏం స్కీం నడుస్తుందో చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. లోకల్‌‌ బాడీస్‌‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదన్నారు. స్టూడెంట్లకు ఇప్పటివరకు బుక్స్‌‌ ఎందుకు రాలేదని, త్రీఫేజ్‌‌ కరెంట్‌‌ ఎన్ని గంటలు ఇస్తున్నారని ప్రశ్నించారు. వానాకాలం సీజన్‌‌ పనులు ముమ్మరంగా సాగుతుంటే రూ. 139 కోట్ల రైతు బంధు పెండింగ్‌‌లో పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.