సీఎంకొకటి.. మంత్రులకో న్యాయమా!

సీఎంకొకటి.. మంత్రులకో న్యాయమా!

నల్లగొండ అర్బన్‍, వెలుగు: టీఆర్‍ఎస్‍లో గ్రూపులు మొదలయ్యాయని, రాష్ట్రంలో ఆ పార్టీకి పోయేకాలం దగ్గర పడిందని, మున్సిపల్‍ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‍రెడ్డి విమర్శించారు. బుధవారం నల్లగొండలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‍ బరితెగించి మాట్లాడుతున్నాడని, మున్సిపల్‍ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే మంత్రుల పదవులు ఊడతాయని అంటున్నారని, మళ్లీ ఎమ్మెల్యే టికెట్‍ ఇవ్వనని అహంకార ధోరణితో మాట్లాడుతున్నాడని అన్నారు. అహంకారం, డబ్బు, మద్యంతో ఎంపీ ఎన్నికల్లో సారూ.. కారు.. 16 అని ప్రచారం చేశారని, వందల కోట్లకు పైగా ఖర్చు పెడితే  7 ఎంపీ సీట్లలో ఓడిపోయారని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో సీఎం సొంత బిడ్డ ఓడిపోయిందని, దానికి ఆ పార్టీ అధ్యక్షుడి పదవి ఎందుకు ఊడలదేని ప్రశ్నించారు. సీఎంకో న్యాయం, మంత్రులు, ఎమ్మెల్యేలకో న్యాయమా అని ప్రశ్నించారు. ఇక నల్గొండ ఎమ్మెల్యే కౌన్సిలర్‍గా పోటీ చేసేవారు తనకు రూ. 25 లక్షలు ఇవ్వాలని, తానే పంచుతానని అంటున్నారని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని అన్నారు.
మున్సిపల్‍ ఎన్నికల్లో టీఆర్‍ఎస్‍ దోచుకున్న డబ్బుతో, పోలీసుల సహకారంతో గెలవాలని చూస్తోందని, ప్రజలు ఓటుతో ఆ పార్టీకి సమాధానం చెప్పాలని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు ఎంపీ సీట్లలో కాంగ్రెస్‍ను గెలిపించిన విధంగా మున్సిపల్‍ ఎన్నికల్లోనూ గెలిపించాలని కోరారు.