రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి మాత్రమే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి మాత్రమే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి మాత్రమే తప్ప ఖర్చు చేసేది శూన్యమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఇబ్రహీంపట్నంలోని ఒ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పార్లమెంటు సమావేశాల ముగిశాక నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సమస్యల అధ్యయనానికి యాత్ర చేపడుతామని వెల్లడించారు. రెండు లక్షల 90 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ అంకెలకు మాత్రమే మరిమితమన్నారు. ఎన్నికల తరుణంలో అంకెల గారడితో బడ్జెట్ కేటాయింపులు చేశారని మండిపడ్డారు. గత బడ్జెట్ కేటాయింపుల్లో రెండు లక్షల 25 వేల కోట్లు ప్రవేశపెడితే.. కనీసం 1,75,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఆదాయమే లేనప్పుడు ఇన్ని లక్షల కోట్లు కేటాయించి ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. 

30 వేల కోట్లు ఖర్చు చేసిన మిషన్ భగీరథ వల్ల ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. మంత్రుల సొంత గ్రామాల్లోనూ తాగునీటి సమస్య జటిలంగా ఉందన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి సొంత గ్రామమైన నాగారంలోనూ నీటి సమస్య ఉందని విమర్శించారు. 5000 జనాభా ఉన్న ఆయన సొంత ఊరులో నీటి కొరత ఉండడం విచారకరమని చెప్పారు. ఇప్పటివరకు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయలేదు.. నల్ల కలెక్షన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ అంశం పై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన ఘనత కేసిఆర్కే దక్కిందని వ్యాఖ్యానించారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చడం కోసం ఈ బడ్జెట్లో ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో తేల్చాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాలు విసిరారు. 9 ఏళ్లలో ఒక ఇల్లు కూడా కట్టలేదని అన్నారు.