
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఏపీ తీసుకోచ్చిన జీవో 203 అమలు కాకుండా చూడాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పోతిరెడ్డి పాడు ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 6 నుంచి 8 టీఎంసీల నీటిని తరలించుకు పోయేందకు ఏపీ ప్రయత్నిస్తోందని, అదే జరిగితే దక్షిణ తెలంగాణ ఏడారి అవుతోందని వెంకట్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, డిండి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC), ఉదయ సముద్రం ప్రాజెక్టులకు నీటి కరువు ఏర్పడుతోందన్నారు.
పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు అమలైతే నాగర్జున సాగర్ కు చుక్క నీరు రాదని, ఆయకట్టు రైతులు సాగు నీటికి, ప్రజలు తాగు నీటికి ఇబ్బందులు పడతారని ఎంపీ తెలిపారు. జంటనగరాలు దాహర్తితో అల్లాడే ప్రమాదం ఉందన్నారు. తక్షణం పోతిరెడ్డి పాడు పనులను నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కు రాసిన లేఖలో తెలిపారు.
కృష్ణ బేసిన్ లోని తెలంగాణ ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా నిధులు కేటాయించాలని, లేని పక్షంలో ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ పెరిగే అవకాశం ఉందన్నారు. పోతిరెడ్డి పాడు విస్తరణ పనులు జరిగితే సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వెంకట్ రెడ్డి. చలో పోతిరెడ్డి పాడు కార్యక్రమం నిర్వహించి కేసీఆర్ విధానాన్ని ఎండగడుతామన్నారు. పోతిరెడ్డి పాడు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు.