నల్గొండలో చేరికలు అక్కర్లేదు : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్గొండలో చేరికలు అక్కర్లేదు : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  •     కేసీఆర్​కు దమ్ముంటే బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి
  •     బీసీలను రేవంత్​ అవమానించలేదు
  •     బీఆర్​ఎస్​ నేతలు డ్రామాలాడుతున్నరు
  •     ధరణితో లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నరని వ్యాఖ్య

హైదరాబాద్​, వెలుగు: నల్గొండ జిల్లా నుంచి కొత్తగా ఎవరూ కాంగ్రెస్​లో చేరాల్సిన అవసరం లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. జిల్లాలోని 12 అసెంబ్లీ సీట్లకు 12 సీట్లు ఇప్పటికే రిజర్వ్​ అయ్యాయని, అన్ని సీట్లలోనూ కాంగ్రెస్​ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వేముల వీరేశం కాంగ్రెస్​లో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వేముల వీరేశం, శశిధర్​రెడ్డి పార్టీలో చేరే అంశం ఇప్పటివరకైతే చర్చకు రాలేదని వెంకట్​రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​లోని అందరం కలసికట్టుగా బస్సు యాత్ర నిర్వహించాలన్నది తన ఉద్దేశమని చెప్పారు. వచ్చే నెల నుంచి ఎన్నికల కార్యాచరణకు మరింత పదును పెడ్తామన్నారు. ఇకపై సీనియర్​ నేతలందరి ఇండ్లల్లోనూ వరుస సమావేశాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బీసీలను కాంగ్రెస్​ ఎప్పుడూ అవమానించలేదని, బీసీలను అవమానించారంటూ బీఆర్​ఎస్​ నేతలు డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్​కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో  కేటీఆర్​ను కాకుండా బీసీ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని సవాల్​ విసిరారు. ‘‘పీసీసీ చీఫ్​ను పట్టుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే దానికే రేవంత్​ కౌంటర్​ ఇచ్చారు తప్ప బీసీలను అవమానించలేదు. అన్ని కులాలు, మతాలను గౌరవించే సెక్యులర్​ పార్టీ కాంగ్రెస్. అన్ని వర్గాలకూ న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్సే” అని ఆయన తెలిపారు. 

యుద్ధం ఇక వంద రోజులే

ఎన్నికల యుద్ధానికింక వంద రోజులే ఉందని, ఆ యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్​ గెలవాలని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. దానికి సంబంధించిన రోడ్​ మ్యాప్​పై చర్చించేందుకే ముఖ్య నేతలతో తన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గెలవాల్సింది కాంగ్రెస్​ పార్టీ ఒక్కటే కాదని, గెలవాల్సింది ప్రజలని ఆయన అన్నారు. ప్రజలు గెలవాలంటే పార్టీలోని నాయకులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని  చెప్పారు. తామందరి లక్ష్యం 4 కోట్ల మంది ప్రజలను నియంత పాలన నుంచి విముక్తి కల్పించడమేనన్నారు. సమావేశంలో భాగంగా ఎన్నికల యాక్షన్​పై చర్చించామని వివరించారు. రాష్ట్ర బడ్జెట్​, ఆదాయం ప్రకారమే కాంగ్రెస్​ మేనిఫెస్టో ఉంటుందని, దాన్ని అమలు చేస్తామని తెలిపారు. కేసీఆర్​లాగా వంద హామీలిచ్చి వదిలేయబోమని అన్నారు. ధరణిని తీసుకొచ్చి పేదల భూములను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. పది లక్షల మంది రైతులు రుణమాఫీకాక ఇబ్బంది పడుతున్నారని, లక్షలాది మంది రైతులు ధరణితో కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రతి స్కీమ్​లోనూ కమీషన్లను దండుకుంటున్నారని, ఎన్నికల కోసం దళితబంధు పథకాన్ని పెట్టి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దళితబంధులో 40 శాతం కమీషన్​ తీసుకుంటున్నారని, బీసీ సాయంలోనూ దండుకుంటున్నారని దుయ్యబట్టారు.  ‘‘సమావేశంలో ఎన్నో విషయాలను చర్చించినం. అవన్నీ ఇప్పుడే చెప్పేస్తే సీఎం కేసీఆర్​ ప్రగతిభవన్​ను ఖాళీ చేసి ఫామ్​హౌస్​కు వెళ్లిపోతడు” అని కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు.

బీఆర్​ఎస్​కు ఆదరణ తగ్గింది: సంపత్ ​కుమార్

త్వరలోనే పీఏసీ సమావేశం నిర్వహిస్తామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​ కుమార్​ తెలిపారు. సమావేశంలో అనేక రాజకీయ అంశాలను చర్చించామన్నారు. ఈ నెల 30న కొల్లాపూర్​లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆ సభకు ప్రియాంకా గాంధీ హాజరవుతారని ఆయన చెప్పారు. గ్రామ స్థాయిలో బీఆర్​ఎస్​కు ఆదరణ తగ్గిందన్నారు.