నిత్యావసరాల ధరలు పెరిగినా.. జీతాలు మాత్రం పెరగలేదు

నిత్యావసరాల ధరలు పెరిగినా.. జీతాలు మాత్రం పెరగలేదు
  • ఆరోగ్య మిత్ర‌లకు  2007లో ఇచ్చిన జీతాలనే ఇప్పటికీ ఇస్తున్నారు
  • ఫార్మాసిస్టుల‌ను రెగ్యులరైజ్ చేయాలి
  • ఏఎన్ఎంలకు సమానవేతనం ఇవ్వాలి
  • సీఎం కేసీఆర్‌ను కోరిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వ‌హిస్తున్న ఫార్మాసిస్టులు, ఆరోగ్య‌మిత్ర‌లు మరియు ఏఎన్ఎంల స‌మ‌స్య‌లను వెంట‌నే పరిష్కరించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా.. వారి జీతాలు మాత్రం పెంచట్లేదని ఆయన అన్నారు. కాంటాక్టు ప‌ద్దతిలో విధులు నిర్వ‌హిస్తున్న ఫార్మాసిస్టుల‌ను రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్య మిత్ర‌లకు 2007లో ఇచ్చిన వేతనాలనే ఇప్పటికీ ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీనియర్లు, జూనియర్లు అని తేడా చూపి ఏఎన్ఎంలకు తక్కువ జీతాలిస్తున్నారని ఆయన అన్నారు.

‘నిత్యం ఫార్మహౌస్‌లో ఉండే సీఎం కేసీఆర్‌కు ఒక మనవి. కరోనాను లెక్క చేయ‌కుండా విధ‌ులు నిర్వ‌హిస్తున్న ఫార్మాసిస్టులు, ఆరోగ్య‌మిత్ర‌లు మరియు ఏఎన్ఎంల స‌మ‌స్య‌లను వెంట‌నే పరిష్కరించండి. గ‌త 21 సంవ‌త్స‌రాలుగా కాంటాక్టు ప‌ద్దతిలో విధులు నిర్వ‌హిస్తున్న ఫార్మాసిస్టుల‌ను రెగ్యులరైజ్ చేయండి.

నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరుగుతున్నా.. 2007లో నియ‌మించిన ఆరోగ్య మిత్ర‌ల వేత‌నాలు మాత్రం పెంచ‌ట్లేదు. 2007లో ఇచ్చిన 10వేల వేత‌నాన్నే ఇప్ప‌టికీ ఇస్తున్నారు. వీరికి ఇచ్చే జీతాల‌తో స‌గ‌టు మాన‌వుడు జీవించ‌డం చాలా క‌ష్టం. కాబ‌ట్టి వీరికి నెల‌కు 30వేల రూపాల‌య‌లు వేత‌నంగా ఇవ్వండి.

వీటితో పాటు ఏఎన్ఎం-2ల‌ను స‌ర్కార్ చిన్న చూపు చూస్తుంది. వీరికి ఏఎన్ఎం-1తో స‌మానంగా విధులు ఇచ్చి.. వేత‌నం విష‌యంలో మాత్రం చిన్నా పెద్ద అనే తేడా చూపిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలో పేషెంట్ల ద‌గ్గ‌ర ఉండి ఎంతో సేవ చేస్తున్న ఏఎన్ఎం-2ల‌కు ఏఎన్ఎం-1తో స‌మానంగా వేత‌నం ఇవ్వాలని కోరుతున్నాను’ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్వీట్ చేశారు.