ఇకపై గాంధీభవన్ మెట్లెక్కను..

ఇకపై గాంధీభవన్ మెట్లెక్కను..

ఇకపై గాంధీభవన్ మెట్లెక్కనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తన రాజకీయ భవిష్యత్తు కార్యకర్తలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. టీపీసీసీ కాస్తా టీడీపీ పీసీసీగా మారిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ పదవిని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఓటుకు నోటు మాదిరిగా.. నోటుకు పీసీసీని అమ్మేశారని ఆరోపించారు. ఇక నుంచి తన నియోజకవర్గానికే పరిమితమవుతానని ఆయన తేల్చి చెప్పారు. టీపీసీసీ ఎంపికపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై విమర్శలు చేయనని ఆయన అన్నారు.

టీపీసీసీ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా అంతర్గత గొడవలు జరుగుతున్నాయి. తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్‌గా కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డిని నియమించింది. దాంతో ఎప్పటినుంచో పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లకు మొండి చెయ్యి చూపినట్లైంది. టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన నేతలెవరూ తనను కలసే ప్రయత్నం చేయొద్దని పరోక్షంగా రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి సూచించారు.