స‌ర్కార్ చేత‌గాని త‌నం వ‌ల్లే  సునీల్ ఆత్మ‌హ‌త్య‌

స‌ర్కార్ చేత‌గాని త‌నం వ‌ల్లే  సునీల్ ఆత్మ‌హ‌త్య‌
  • సునీల్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
  • యువ‌త ఎవ్వ‌రు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ు 
  • కుటుంబ స‌భ్యుల‌కు ప‌దవులిచ్చిన కేసీఆర్.. నిరుద్యోగుల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదు
  • ఉద్యోగాలు భ‌ర్తీ చేయకుండా నిరుద్యోగుల‌ జీవితాల‌తో చెల‌గాటం
  • ప్రభుత్వంపై మండిపడ్డ భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

‘విద్యార్థులు ప్రాణత్యాగాలకు దిగొద్దు. ఒకవేళ ఏదైన త్యాగం చేయాల్సి వస్తే మేం ముందుంటాం’ అని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. ఉద్యోగం రాలేదని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ సునీల్ మృతిపై ఆయన స్పందించారు. సునీల్ నాయ‌క్‌ది ఆత్మ‌హ‌త్య కాద‌ని.. ముమ్మాటికీ కేసీఆర్ స‌ర్కార్ చేత‌గానీత‌నంతో చేసిన హ‌త్యేన‌ని ఆయన ఆరోపించారు. ప్ర‌భుత్వం ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆయన అన్నారు. తన కుటుంబంలో న‌లుగురికి ప‌ద‌వులిచ్చిన కేసీఆర్.. రాష్ట్రంలోని యువ‌త‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని కోమటిరెడ్డి మండిప‌డ్డారు.


‘గ‌త వారం కాకతీయ యూనివ‌ర్సిటీలో సునీల్ నాయ‌క్ విషం తీసుకుని చికిత్స పొందుతూ.. శుక్రవారం గాంధీ ఆస్ప‌త్రిలో మృతి చెంద‌డం బాధాక‌ర‌ం. సునీల్ ఆత్మకు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతున్ని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి. ఆయన కుటుంబానికి మేం అండ‌గా ఉంటాం. చ‌నిపోయిన సునీల్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయ‌ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. యువ‌త ఎవరూ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్ద‌ు. ప్రాణాలతో ఉండి అస‌మ‌ర్థ స‌ర్కార్‌ను గ‌ద్దె దించేంద‌కు న‌డుం బిగించాలి. ఉద్యోగాలు రాక యువ‌త ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటున్నా.. స‌ర్కార్ మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంది. అస‌లు ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌కు స‌భ్యుల‌ను నియ‌మించ‌కుండా నిరుద్యోగుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నార‌ు. క‌మిష‌న్ స‌భ్యులను నియ‌మించాల‌నే ధ్యాస‌లేని కేసీఆర్ ప్ర‌భుత్వం.. ఉద్యోగాలు ఎలా భ‌ర్తీ చేస్తుంది. ప్రభుత్వం అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించి ఉద్యోగాల భ‌ర్తీ చేప‌డితే సునీల్ నాయ‌క్ ఆత్మ‌హ‌త్య చేసుకునేవాడు కాదు. ఇప్ప‌టికే తెలంగాణ మ‌లిద‌శ పోరాటంలో 1200 మంది యువ‌త ప్రాణాలు అర్పించార‌ు. యువ‌త త్యాగాల‌తో తెచ్చుకున్న తెలంగాణ‌లో మ‌ళ్లీ యువ‌త ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌డం బాధాక‌ర‌ం. అంద‌రం క‌లిసి స‌ర్కార్‌పై ఒత్తిడి తెచ్చి ఉద్యోగాలు సాదిద్దాం.. కానీ, ఇలా ఆత్మ‌ార్పణ‌లు చేసుకోవద్దు. ఏదైనా త్యాగం చేయాల్సి వ‌స్తే నేత‌లుగా మేం ముందుంటాం.  వెంట‌నే పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ స‌భ్యుల‌ను నియ‌మించి.. ఒకే ద‌ఫాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాలి’ అని కోమటిరెడ్డి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.