
* తెలంగాణలోనే ఏకైక దేవాలయం శాలిగౌరారం సూర్యదేవాలయం
* నేడు శిథిలావస్థకు చేరుకున్న 11వ శతాబ్ధంలో నిర్మించిన దేవాలయం
* వెంటనే పునరుద్దరణ ప్రారంభమయ్యేలా చూడాలని వినతి
* గవర్నర్‌కు లేఖ రాసిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణలోని అతిపురాతన ఏకైక సూర్యదేవాలయాన్ని పునర్ నిర్మించాలని భువనగిరి ఎంపీ కోమట్టిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌కు లేఖ రాశారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని సూర్యదేవాలయం తెలంగాణలో ఉన్న ఏకైక సూర్య దేవాలయమని , ఏపీలోని అరసవెల్లి సూర్యదేవాలయం కంటే పురాతనమైనది వివరించారు. శిధిలావస్థకు చేరుకున్న ఈ దేవాలయాన్ని పునర్ధించి భక్తులకు వసతులు కల్పించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉందని, అలాగే ఈ ఆలయానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.
11వ శతాబ్దంలో నిర్మించిన ఘనమైన చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి పునర్‌వైభవం తీసుకువచ్చేందుకు కృషిచేయాలని కోరారు. ఎంతో చారిత్రాక, గొప్ప కీర్తి కలిగిన దేవాలయం మరుగునపడిపోకుండా.. తక్షణమే ఆలయ పునర్ నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పునర్ నిర్మాణ పనులు మొదలయ్యేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.