విభేదాలు వద్దు.. అందరూ కలిసి పనిచేయండి

విభేదాలు వద్దు.. అందరూ కలిసి  పనిచేయండి

ప్రియాంక గాంధీతో అర్థవంతమైన మీటింగ్ జరిగిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రం, దేశ రాజకీయాలు, రాహుల్ చేపట్టనున్న భారత్ జోడో యాత్రపై కూడా చర్చించామన్నారు. ప్రధానంగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చ జరిగిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ప్రియాంకగాంధీ సూచించారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా చర్చించామన్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టతపై తాను కొన్ని సలహాలు ఇచ్చానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 

పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రియాంక గాంధీతో సమావేశమై కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆమెకు వివరించినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం తనను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని కంప్లైంట్ చేసినట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రియాంకతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. 

సుదీర్ఘ కాలం పార్టీకి సేవలందించిన తాను.. పార్టీలోనే కొనసాగుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఏఐసీసీ నేతల నుంచి పిలుపు వచ్చింది. ప్రియాంకతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని హైకమాండ్ నేతలు కల్పించారు. అధిష్టానం పిలుపు మేరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీని కలిశారు.