కిలో బంగారం ఇచ్చినా  కేసీఆర్​కు ఓటెయ్యరు

కిలో బంగారం ఇచ్చినా  కేసీఆర్​కు ఓటెయ్యరు

యాదాద్రి, వెలుగు: ఇంటికి రూ. 10 లక్షలే కాదు.. కిలో బంగారం ఇచ్చినా ప్రజలు కేసీఆర్​కు ఓటెయ్యరని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం రాంపూర్​తండాలో గురువారం బీర్ల అయిలయ్య అధ్యక్షతన నిర్వహించిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ’లో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్​మళ్లీ అధికారంలోకి వస్తే కేసీఆర్​ కొడుకు కేటీఆర్, మనవడు హిమాన్షు సీఎం అవుతారని చెప్పారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారిలో ఒకరు సీఎం అవుతారని, ఇందుకు సోనియాగాంధీని కూడా ఒప్పిస్తామని అన్నారు. వచ్చే 20 నెలలు కష్టపడితే కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందన్నారు. దళిత, గిరిజనులు ఓట్లేసే యంత్రాలుగా మిగిలిపోవద్దని, ఐక్యంగా రాజ్యాధికారం వైపు పరుగులు తీయాలని సూచించారు. ఉద్యోగులకు జీతాలు ఇయ్యలేక కోకాపేట భూములను అమ్ముకున్న కేసీఆర్​దళితులను మరోసారి మోసం చేయడానికే దళితబంధు తెస్తున్నారని, ఇదంతా హుజూరాబాద్​ ఎన్నికల కోసమేనని ఆరోపించారు. సీఎంవోలో రాహుల్​ బొజ్జాకు చోటు కల్పించగానే 20 శాతం జనాభా ఉన్న ఎస్సీలకు న్యాయం జరిగినట్టేనా అని ప్రశ్నించారు.  కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీలతో పాటు ఎస్టీలకు, బలహీనవర్గాలకు చెందిన ప్రతి ఇంటికి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. భువనగిరి పార్లమెంట్​ పరిధిలోని ప్రతి ఇంటికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తే.. ఎంపీ పదవికి తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్​ నుంచి కవితకు ఎంపీ టికెట్​ ఇస్తే తానే గెలిపిస్తానని చెప్పారు. 
లక్ష మందితో అడ్డుకుంటం
ప్రతి ఇంటికి రూ. 10 లక్షల చొప్పున ఇవ్వకుంటే వాసాలమర్రికి కేసీఆర్​ఎప్పుడొచ్చినా తానే ముందుండి లక్ష మందితో అడ్డుకుంటానని ఎంపీ ప్రకటించారు. ఫాంహౌస్​కు వెళ్లడానికి అడ్డుగా ఉందన్న కారణంగానే వాసాలమర్రి ప్రజలను సీఎం మభ్యపెడుతున్నారని ఆరోపించారు. యాదగిరిగుట్టకు దేవుడిని చూడడానికి కేసీఆర్​తరచూ వస్తుంటారని, కానీ హాజీపూర్​లో ముగ్గురు ఆడపిల్లలను రేప్​ చేసి చంపినా కనీసం పరామర్శించలేదన్నారు. పేదల ప్రజలను ఆదుకొని సేవ చేస్తే దేవుడిని సేవ చేసినట్టే అని అన్నారు. ధరణి పేరుతో పేదల భూములను దొరలకు అప్పగించాలని కేసీఆర్​ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వెంటనే దానిని ఎత్తి వేయాలని డిమాండ్​ చేశారు.  
చిల్లర నాయకులను పట్టించుకోవద్దు
‘పనికిమాలిన చిల్లర నాయకులు, బ్రోకర్​నా కొడుకులు కొందరు కాంగ్రెస్​లో ఉన్నారు. వారిని పట్టించుకోవద్దు. వచ్చే ఎన్నికల నాటికి అందరం కలిసి కూర్చొని ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నుకుందాం’ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభపై కాంగ్రెస్​లోని కొందరు సోషల్​ మీడియాలో పెద్దఎత్తున వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఎవరికీ సమాచారం లేకుండా సభను నిర్వహిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని ఎంపీ కోమటిరెడ్డి దృష్టికి తేవడంతో ఆయన పై విధంగా కామెంట్​ చేశారు.