పీసీసీ చీఫ్​కు అందరినీ గెలిపించే సత్తాలేదు

పీసీసీ చీఫ్​కు అందరినీ గెలిపించే సత్తాలేదు
  • కాంగ్రెస్‌లో ఆ కెపాసిటీ ఉన్న లీడర్ లేడు
  • ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

యాదాద్రి/హైదరాబాద్​, వెలుగు: “వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ అభ్యర్థులందరినీ గెలిపించే సత్తా పీసీసీ అధ్యక్షుడు సహా ఎవరికీ లేదు. పక్క నియోజకవర్గం నుంచి వచ్చి.. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో గెలిపించేటోళ్లు కూడా లేరు” అని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా భువనగిరిలో ఆయన విగ్రహానికి కోమటిరెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రైతులకు మేలు చేశారని, చంద్రబాబు మాత్రం తన రాక్షస పాలనలో నలుగురు రైతులను కాల్చి చంపారన్నారు. కాంగ్రెస్ లో ఇప్పుడు వైఎస్ వంటి లీడర్లు లేరన్నారు. తనకు పని ఉండటం వల్ల టీపీసీసీ చీఫ్​గా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి వెళ్లలేకపోయానని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా వెళ్లలేదన్నారు. పీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బాహాటంగానే కామెంట్లు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  మల్కాజిగిరి పరిధిలోని కార్పొరేటర్లనే రేవంత్ గెలిపించుకోలేకపోయారని అన్నారు. అందరికీ డిపాజిట్లు పోయాయని, గెలిచిన ఇద్దరు సొంతంగానే గెలిచారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే టికెట్లు కన్ఫాం చేయాలని, ఎవరికి వారు కనీసం ఒక్కొక్కరిని గెలిపించుకోవాలని కోమటిరెడ్డి అన్నారు. ఇక్కడి నాయకులు హైదరాబాద్​కు పోయి.. పుల్లలు పెట్టి.. ఫొటోలు దిగినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదన్నారు. తన నియోజకవర్గం పరిధిలో తనను కాదని టికెట్ ఇచ్చేవాడు లేడన్నారు. గాంధీభవన్​కు పోయినా.. పోకున్నా.. భువనగిరి పరిధిలోని ఏడు స్థానాల్లో గెలిచే వారికే టికెట్ ఇప్పించి గెలిపించుకుంటానని చెప్పారు.  

షర్మిలకు ఆల్ ది బెస్ట్​
రాష్ట్రంలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆల్ ​ది బెస్ట్​ చెప్పారు. గురువారం పార్టీ ఆవిర్భావ వేడుక జరిగిన జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌ దగ్గరకు వచ్చిన ఆయన..  వైఎస్సార్ అభిమానులతో మాట్లాడారు. పార్టీ ఆవిర్భావ వేడుకకు రావాల్సిందిగా తనకు ఆహ్వానం పంపారని గుర్తుచేశారు. వైఎస్ గొప్ప నేత అని, భువనగిరిలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నానని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.