ఒడిశా కోల్​మైన్​లో కేటీఆర్​ అవినీతి

ఒడిశా కోల్​మైన్​లో కేటీఆర్​ అవినీతి
  • ఒడిశా కోల్​మైన్​లో కేటీఆర్​ అవినీతి
  • ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  • బంధువు ద్వారా అదానీకి కోల్​మైన్​అప్పజెప్పే ప్రయత్నం
  • రూ.40వేల కోట్ల గోల్​మాల్​​

యాదాద్రి/బొమ్మల రామారం, వెలుగు : మంత్రి కేటీఆర్​ రూ.40వేల కోట్ల అవినీతికి తెరలేపారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు. ఒడిశాలోని కోల్​మైన్​ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయిస్తే.. కేటీఆర్​ తన బంధువు అయిన ప్రతిమా శ్రీనివాస రావు ద్వారా అదానీకి అప్పగించే పనిలో ఉన్నారని విమర్శించారు.  దీనిపై తాను కోర్టుకు వెళ్లానని తెలిపారు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం రాంలింగంపల్లిలో జరిగిన పలు కార్యక్రమాల్లో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని స్కూల్​ను సందర్శించి టెక్ట్స్​బుక్స్ రాలేవని తెలుసుకొని.. తాను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆలేరు నియోజకవర్గ ఇన్​చార్జ్​ బీర్ల అయిలయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్​, కేటీఆర్​లు చేస్తున్న అవినీతి, అక్రమాలన్నింటినీ బయటపెడ్తానని ప్రకటించారు. అదానీకి మోడీ సర్కార్​ దోచిపెడుతోందని ఆరోపిస్తున్న కేటీఆర్​.. ఆయన కూడా అదే చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణను రూ.5లక్షల కోట్ల అప్పుల పాల్జేసిన కేసీఆర్​పై కేంద్రం ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీఆర్​ఎస్​, బీజేపీ కొట్లాడుకుంటున్నట్టు యాక్షన్​ చేస్తున్నాయని విమర్శించారు. 24 గంటలు కరెంట్​ ఇస్తున్నామంటూ కేసీఆర్​ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. కేవలం ఎన్నికల కోసం దళితబంధు స్కీం తెచ్చారని విమర్శించారు. 4.80 లక్షల పాత పింఛన్లను పెండింగ్లో పెట్టారన్నారు. డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఏవని, ఎక్కడ కట్టారో చూపించాలని ఎద్దేవా చేశారు. ఖాళీ జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తానని ఎన్నికల ముందు చెప్పిన కేటీఆర్, ఆ తర్వాత రూ.3 లక్షలకు మార్చారని ఆరోపించారు. చెప్పినట్టుగా ఆ రూ.3 లక్షలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.