
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. పార్లమెంట్ భవనం ప్రారంభంపై విపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కావాలనే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మోదీ పై విమర్శలు చేస్తే అభాసుపాలు అవుతారని కూడా గమనించలేకపోతున్నారని చెప్పారు.
దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు విదేశీ భావజాలం ఉన్న పార్టీల వలే మాట్లాడుతున్నాయని ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. గతంలో యుపీఎ చైర్మన్ గా ఉన్న సోనియా గాంధీ ఏ హోదాలో ఇతర దేశాలతో చర్చలు జరిపారని ప్రశ్నించారు. సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ కు కేసీఆర్ ఆహ్వానించలేదని విమర్శించారు.