బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం

బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం
  • రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాజకీయాలను స్వార్థపూరితంగా కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఓటర్లను ప్రలోభ పెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ  9 ఏండ్ల పాలనకు సంబంధించిన పుస్తకాలను ముషీరాబాద్ సెగ్మెంట్​లో వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులకు బుధవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు బిహార్​లో సమావేశమయ్యాయని.. దానిలో భాగంగా కేసీఆర్​ను అఖిలేశ్ యాదవ్  కలిశారన్నారు. కేసీఆర్ స్వార్థ రాజకీయాలకు తెలంగాణ జనం మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని చెప్పారు.  

రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని లక్ష్మణ్​ స్పష్టం చేశారు.  సమాజాన్ని ప్రభావితం చేసే విద్యావంతులు, మేధావులు,  ప్రముఖులను వ్యక్తిగతంగా కలిసి ప్రధాని చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పుస్తక రూపంలో  అందజేస్తున్నామని చెప్పారు. మార్పు అనేది నిరంతర ప్రక్రియ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పుపై  లక్ష్మణ్ స్పందించారు. మార్పు అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు.  ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఎవరైనా హై కమాండ్​ ఆదేశాల మేరకు పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీకి దీటైనా శక్తి ఏది లేదని, రాష్ట్రంలో  పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి పని చేయాలని శ్రేణులకు లక్ష్మణ్​ సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పావని, నేతలు పాల్గొన్నారు.