ప్రభుత్వాన్ని కూలగొట్టి కాదు.. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తం: ఎంపీ లక్ష్మణ్

ప్రభుత్వాన్ని కూలగొట్టి కాదు.. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తం: ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: తాము ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని, ప్రభుత్వాన్ని కూలగొట్టి కాదని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ ప్రభుత్వం ఐదేండ్లు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. తెలంగాణలో ప్రధాని మోదీ మూడ్రోజుల పాటు పర్యటించనున్నారని, ఇందులో రాష్ట్రంలో కేంద్రం ద్వారా చేసిన అభివృద్ధి పనులను లెక్కలతో సహా వివరిస్తారని పేర్కొన్నారు.

గురువారం బీజేపీ స్టేట్‌‌ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఎన్వీ సుభాష్, మురళీధర్, సునీతా రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో లక్ష్మణ్‌‌ మాట్లాడారు. ఈ నెల 15, 16, 18 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారని తెలిపారు. గత పదేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ, బీఆర్ఎస్ కూల్చాలని చూస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఆయనకు అంత అభద్రతా భావం ఎందుకని ప్రశ్నించారు. తన ఎమ్మెల్యేల మీద ఆయనకు నమ్మకం లేదని, నమ్మకం ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాపాడుతారని ఎందుకు అంటారని ప్రశ్నించారు. తమ పాలనకు ఈ ఎన్నికలు రెఫరాండం అని, 14 సీట్లు గెలుస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారని, దానికి కట్టుబడి ఉండాలన్నారు. మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని రేవంత్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు. త్రిపురలో ఒక్క సీటు లేకున్నా, రెండుసార్లు అధికారంలోకి వచ్చామని, 25 ఏండ్ల కమ్యూనిస్టు కంచుకోటను కూల్చామని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని తెలిపారు.