బీసీని సీఎం చేసే సత్తా బీజేపీకే ఉంది : లక్ష్మణ్

బీసీని సీఎం చేసే సత్తా బీజేపీకే ఉంది : లక్ష్మణ్
  • బీసీని సీఎం చేసే సత్తా బీజేపీకే ఉంది
  • ఫస్ట్ లిస్టులో బీసీలకు 20కి పైగా సీట్లు: లక్ష్మణ్
  • బీసీ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నామని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలో బీసీని సీఎం చేసే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేంద్ర కేబినెట్​లో 27 మంది బీసీలకు అవకాశం కల్పించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. శనివారం ఢిల్లీలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటిస్తున్నామని చెప్పారు. ‘‘ఇంతకాలం కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను బానిసలుగా చూస్తూ.. ఓటు బ్యాంక్ గా మాత్రమే వాడుకున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు బీజేపీ పెద్దపీట వేయనుంది. ఈసారి బీసీ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాం” అని ఆయన తెలిపారు. ఫస్ట్ లిస్ట్​లో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. 

సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని... అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాత ఈ విషయం అందరికీ అర్థమవుతుందన్నారు. ‘‘మహిళలకు సీట్ల విషయంలో బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తున్నది. ఢిల్లీలో కవిత ధర్నాలు చేసింది. కానీ ఆమె పార్టీలోనే మహిళలకు సీట్లు ఇవ్వలేదు” అని విమర్శించారు. ‘‘బీసీ సమాజం బీజేపీ వైపు చూస్తోంది. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు బీజేపీ అమలు చేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తాం. ఏ క్షణంలోనైనా అభ్యర్థుల ప్రకటన ఉంటుంది” అని చెప్పారు.