బీజేపీని గెలిపిస్తే..గుజరాత్, యూపీలా డెవలప్ చేస్తం: ఎంపీ లక్ష్మణ్

బీజేపీని గెలిపిస్తే..గుజరాత్, యూపీలా డెవలప్ చేస్తం: ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ఒక్క అవకాశం ఇవ్వాలని రాష్ర్ట ప్రజలకు బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. బీజేపీని గెలిపిస్తే రాష్ర్టాన్ని గుజరాత్, యుపీలా డెవలప్ చేస్తామన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించామని, దీంతో వాటి ధరలు తగ్గాయన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చాక వ్యాట్ తగ్గిస్తామని ప్రకటించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. 

గత 9 ఏండ్లుగా రాష్ర్ట ప్రభుత్వం సహకరించకపోయినా రూ. లక్షల కోట్ల నిధులను ఇచ్చి కేంద్రం అభివృద్ధి పనులు చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన బలిదానాలపై కాంగ్రెస్ నేత చిదంబరం చేసిన కామెంట్లు.. హత్య చేసినవాళ్లే నివాళులు అర్పించినట్టుగా ఉందన్నారు. కర్నాటకలో గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ పార్టీ అక్కడి ప్రజలను మోసం చేసిందని ఆ పార్టీని నమ్మొద్దన్నారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడుదొంగలని లక్ష్మణ్ విమర్శించారు. బీఆర్ఎస్ ఎప్పటికైనా కాంగ్రెస్ తో కలిసిపోతుందన్నారు. బీసీని సీఎం చేస్తామని బీజేపీ అంటే.. రాహుల్ గాంధీ, కేటీఆర్ బీసీలను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కాకపోతే ఇందులో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని చెప్పారు. ‘‘రెడ్డీలు, చౌదరిలు కర్నాటకలో బీసీలు. వైశ్యులు, బ్రాహ్మణులు కూడా కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగాగ ఉన్నారు” అని తెలిపారు. కర్నాటకలో బీసీ కులగణన చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు.