రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి : ఎంపీ మల్లు రవి

రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి : ఎంపీ మల్లు రవి

వంగూరు, వెలుగు: రైతులు శాస్త్రవేత్తల సలహాలను పాటించాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సూచించారు. సోమవారం మండలంలోని కొండారెడ్డిపల్లి రైతు వేదికలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకే ఎరువులు వాడాలన్నారు. సాగు నీటిని ఆదా చేయాలని, పంట మార్పిడి అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్  మెంబర్  కేవీఎన్ రెడ్డి, డీసీసీ చైర్మన్  విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెట్  వైస్  చైర్మన్  దేశినేని పండిత్ రావు, వ్యవసాయ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్  విద్యాసాగర్ రావు, డీఏవో చంద్రశేఖర్  పాల్గొన్నారు.

కార్యకర్తలే పార్టీకి బలం..

నాగర్​కర్నూల్ టౌన్: కార్యకర్తలే పార్టీకి బలమని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలో ఎమ్మెల్యే రాజేశ్​రెడ్డితో కలిసి పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం పని చేశారన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం తాను పని చేస్తానని తెలిపారు. గ్రూప్  రాజకీయాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి  తీసుకెళ్లాలని సూచించారు. గిరిజన కో ఆపరేటివ్  కార్పొరేషన్  చైర్మన్  బెల్లయ్య నాయక్, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, రమణా రావు 
పాల్గొన్నారు.

రైతులను ఆదుకుంటాం

ఆమనగల్లు: ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఎంపీ మల్లు రవి సూచించారు. కడ్తాల్  మండలం ముద్విన్, కడ్తాల్ లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ చైర్మన్  విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.