
- ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనకే ఓటు వేయండి
న్యూఢిల్లీ, వెలుగు: దేశ ప్రజలకు న్యాయం జరగాలంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించాలని ఎంపీ మల్లు రవి అన్నారు. పార్టీలకు అతీతంగా ఎంపీలందరు ఆయనకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ నెల 9న ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయని, దీని కంటే ముందు.. 8వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాలులో ప్రతిపక్షాలు మాక్ పోలింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
గతంలో 15 మంది ఓటు సరిగా వేయలేదని గుర్తుచేశారు. ‘‘ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా ఉందని.. దీనిపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. కానీ.. ఎన్డీయే ప్రభుత్వానికి చర్చ చేయడం ఇష్టం లేకే పార్లమెంట్‌ను వాయిదాల పద్ధతిలో కొనసాగించారు. కనీసం ప్రతిపక్ష పార్టీల సభ్యులు కీలక బిల్లులపై నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ఇవ్వలేదు”అని ఆయన అన్నారు.
జగదీప్ ధన్‌ఖడ్ ఏమయ్యారు?
మరోవైపు, ఆకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేసిన మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అసలు ఏమయ్యారో? ఎక్కడున్నారో? తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఆయన రాజీనామాకు కారణం ఎన్డీయే ప్రభుత్వ ఒత్తిడేనని తెలుస్తోంది. కనీసం ఆయనకు వీడ్కోలు చెప్పే కార్యక్రమం కూడా నిర్వహించకపోవడం అందుకు నిదర్శనం. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఆయన్ను కనీసం మాట్లాడనివ్వడం లేదు.
మాట్లాడితే.. భవిష్యత్తు లేకుండా చేస్తామని బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది’’అని మల్లు రవి అన్నారు. ఎన్డీయే తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి రాధాకృష్ణన్ అందరూ ఎంపీలకు లేఖ రాశారని, దేశంలో క్రిటికల్ పరిస్థితి ఉందని చెప్పారని, కానీ.. ఈ పరిస్థితులకు ఎవరు బాధ్యులో చెప్పలేదన్నారు. ఈ పరిస్థితులకు కారణం ఎన్డీయే ప్రభుత్వమే కారణమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.