ఈడీ ఆస్తుల జప్తుపై హైకోర్టుకు ఎంపీ నామా

ఈడీ ఆస్తుల జప్తుపై హైకోర్టుకు ఎంపీ నామా

హైదరాబాద్, వెలుగు : రాంచీ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వే పనుల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ఈడీ పెట్టిన కేసును కొట్టేయాలని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీ నామా నాగేశ్వరరావు దాఖలు చేసిన రిట్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. ఈడీ కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌ భూయాన్‌‌‌‌ శుక్రవారం ఈడీకి నోటీసులు జారీ చేశారు. మధుకాన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ కంపెనీకి 2009లోనే నామా రాజీనామా చేశారని, ఆ కంపెనీతోగాని.. రాంచీ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వే లిమిటెడ్‌‌‌‌తోగాని ఆయనకు ఎలాంటి సంబంధం లేదని నామా తరఫు సీనియర్‌‌‌‌ అడ్వొకేట్‌‌‌‌ నిరంజన్‌‌‌‌రెడ్డి కోర్టుకు తెలిపారు.

2020లో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో కూడా ఆయన పేరు లేదని వెల్లడించారు. అయినా నామా ఆస్తులను జప్తు చేసి ఎటాచ్‌‌‌‌ చేశారని కోర్టుకు విన్నవించారు. ఈడీ చేసిన జప్తులపై స్టే ఇవ్వాలని కోరారు. ఈడీ తరఫున అడిషినల్‌‌‌‌ సొలిసిటర్‌‌‌‌ జనరల్‌‌‌‌ సూర్యకరణ్‌‌‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు నుంచి నామా ఆర్డర్‌‌‌‌ పొందినందునా ఏవిధమైన చార్జిషీట్లు కూడా దాఖలు కాలేదని తెలిపారు. కేవలం ఆస్తుల జప్తు మాత్రమే జరిగిందన్నారు. వాదనలు విన్న కోర్టు.. ఈడీ కౌంటర్‌‌‌‌ వేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.