మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని మహబూబాబాద్ఎంపీ పోరిక బలరాం నాయక్ అధికారులకు సూచించారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టరేట్లో దిశ సమావేశాన్ని ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ గృహలకు పెండింగ్ లో ఉన్న బకాయిలను లబ్ధిదారులకు సకాలంలో చెల్లించాలన్నారు. పట్టణంలోని ఇన్నర్ రింగు రోడ్డు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి, పనులు త్వరగా మొదలు పెట్టాలన్నారు.
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్ మాట్లాడుతూ మరిపెడ మున్సిపాలిటీ లో అమృత్ 2.0 పనులు పూర్తి చేయాలన్నారు. డోర్నకల్ మున్సిపాలిటీ అమృత్ 2.0 మూడు వాటర్ ట్యాంకుల అభివృద్ధి స్పీడప్, వివిధ నేషనల్ హై వేల పనులకు సంబంధించి పనులను టెండర్ పూర్తి చేసి పనులు మొదలయ్యేలా చూడాలన్నారు. డోర్నకల్ ఇన్నర్ రోడ్డు ప్రపోజల్స్ త్వరగా తయారు చేసి ఇవ్వాలనున్నారు. గొల్ల చర్ల _ములకలపల్లి రోడ్డు పునరుద్ధరించాలన్నారు.
మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్మాట్లాడుతూ జిల్లాలో తండాల రోడ్లను సరి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్లో 4వ ప్లాట్ ఫారం పనులు వేగవంతం చేయాలని చెప్పారు. కేసముద్రం వర్క్ షాప్ నకు సంబంధించి రైల్వే అధికారులు చొరవ చూపాలన్నారు. డోర్నకల్ రైల్వే ట్రాక్ మునిగిపోవడానికి కారణాలు 3 చెరువులు అక్రమంగా వెంచర్లని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.అనిల్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు తదితరులు పాల్గొన్నారు.
