విదేశీ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలి: ఆర్ కృష్ణయ్య

విదేశీ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలి: ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: విదేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ స్టూడెంట్లకు రూ.20లక్షల స్టైఫండ్ మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఆదివారం సెక్రటేరియట్​లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. విదేశీ విద్యకు సంబంధించి విద్యార్థుల సమస్యలను వివరించారు.

 అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 300 బీసీ స్టూడెంట్లకు మాత్రమే స్టైఫండ్ మంజూరు చేస్తున్నారని చెప్పారు. అత్యధికంగా బీసీలు విదేశీ విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2 వేల మంది బీసీ స్టూడెంట్లకు విదేశీ విద్య స్టైఫండ్ అందజేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి పొన్నం సానుకూలంగా స్పందించారని, సీఎంతో చర్చించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, రాజేందర్, సతీశ్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.