ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు రూ.5 వేల కోట్లు రిలీజ్ ​చేయాలె

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు రూ.5 వేల కోట్లు రిలీజ్ ​చేయాలె
  • స్టూడెంట్ల మెస్ చార్జీలు పెంచాలి: ఆర్.కృష్ణయ్య
  • డిమాండ్లు నెరవేర్చకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిక

మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ రూ.5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇంజినీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ, ఇతర కోర్సులు చదివే బీసీ స్టూడెంట్లకు మొత్తం ఫీజులు చెల్లించాలని, రెండేండ్ల ఫీజు బకాయిలు రూ.5 వేల కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని, మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీవో ఆఫీసుల ముట్టడికి బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా స్టూడెంట్లు, బీసీ సంఘాల నేతలు మాసబ్ ట్యాంకులోని సంక్షేమ భవనాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, బీసీ స్టూడెంట్ల ఫీజు బకాయిలకు సంబంధించి రూ.5 వేల కోట్ల బిల్లులు ప్రభుత్వం పాస్ చేయడం లేదన్నారు. 

బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఆధ్వాన పాలన వల్ల ధనిక రాష్ట్రం కాస్తా దివాళా తీసిందన్నారు. 2008లో పోరాడి ఫీజుల రీయింబర్స్‌​మెంట్ స్కీమ్​‌ పెట్టించినప్పుడు.. ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ తదితర కోర్సుల ట్యూషన్ ఫీజులు, స్పెషల్ ఫీజలు ఎంత ఉంటే అంత ప్రభుత్వం భరించేదన్నారు. 2014 నుంచి ప్రభుత్వం ఫీజుల స్కీమ్​కు పరిమితులు విధిస్తూ జీవోలో మార్పులు చేసి బీసీ స్టూడెంట్లకు అరకొరగా ఫీజులు మంజూరు చేస్తున్నదని విమర్శించారు. ఈ తొమ్మిదేండ్లలో ఇంజినీరింగ్, ఇతర కోర్సులన్నింటి ఫీజులు భారీగా పెంచారని గుర్తుచేశారు. పెంచిన ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తున్న ప్రభుత్వాలు.. బీసీ స్టూడెంట్లకు అరకొరగా మంజూరు చేస్తున్నారన్నారు. కేవలం బీసీ స్టూడెంట్లపై వివక్ష చూపడం అన్యాయమని కృష్ణయ్య ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ లాల్ కృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో 295 బీసీ కాలేజీ హాస్టళ్లకు, 321 బీసీ గురుకుల స్కూళ్లలో ఒక్కదానికి కూడా సొంత భవనాలు లేవన్నారు. వాటికి కేటాయించిన స్థలాలను కూడా ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు ధారదత్తం చేస్తున్నారని విమర్శించారు.