గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అదే కోవలో, పక్కా రూరల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచింది. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ‘జాతరొచ్చింది’ పాటతో మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పుడు క్లాస్, రొమాంటిక్ మెలోడీతో సంగీత ప్రియుల ముందుకు వచ్చింది.
శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా విడుదల
సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల లేటెస్ట్ గా ఈ సినిమాలోని రెండో పాట ‘ఏలేలో..’ను విడుదల చేశారు. పాట చాలా బాగుందని, విజువల్స్ పల్లెటూరి అందాలను గుర్తు చేస్తున్నాయని ఆయన చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గురుబిల్లి జగదీష్ అందించిన పదాలు పల్లెటూరి ప్రేమని ప్రతిబింబిస్తున్నాయి. నగేష్ గౌరీష్ సమకూర్చిన బాణీలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.జయశ్రీ పల్లెం, సాయి సందీప్ పక్కి తమ మధురమైన స్వరాలతో ఈ రొమాంటిక్ ట్రాక్‌కు ప్రాణం పోశారు.
తారాగణం
ఈ సినిమాలో కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్స్ కూడా ఉండబోతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. సీనియర్ నటుడు సుమన్, కిట్టయ్య, ఆర్.కే నాయుడు, సలార్ పూజ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తుండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది.నిర్మాణ విలువలపై నమ్మకం: ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీతో పాటు నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎక్కడా రాజీ పడకుండా పల్లెటూరి వాతావరణాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.
త్వరలోనే థియేటర్లలోకి..
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే గ్రాండ్ లెవల్‌లో టీజర్, ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ‘రాయుడి గారి తాలుకా’ అంటూ వస్తున్న ఈ రూరల్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
